● గోపాలపురం, తాళ్లపూడి
మండలాల్లో సంచారం
● ట్రాప్ కెమెరాలు, బోన్ల ఏర్పాటు
తాళ్లపూడి: మండలంలోని పోచవరం పంచాయతీ పరిధి తుపాకులగూడెం పరిసరాల్లోని ఎలుగుకొండ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీ అధికారులు నిర్ధారించడంతో ఈ ప్రాంతం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాళ్లపూడి తహసీల్దార్ ఎన్.లక్ష్మీలావణ్య, ఆర్‌ఐ రామకృష్ణ, సిబ్బందితో కలిసి పోచవరం ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో బయట తిరగొద్దని సూచించారు.
ఆందోళనలో ప్రజలు
దేవరపల్లి: గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లోని పలు గ్రామాల్లో పులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాళ్లపూడి మండలం పొచవరం పంచాయతీ పరిధి ఎలుగుకొండ ప్రాంతం, తుపాకులగూడెం, గజ్జరం గ్రామాల నుంచి గోపాలపురం మండలం భీమోలు, గోపవరం సమీపంలోని ప్రాంతాలకు పులి వచ్చిందన్నారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలలో తిరగొద్దని, పశువులను గ్రామాల్లోకి తెచ్చుకోవాలని కోరుతున్నారు. కాగా.. త్రిపుట్ ఆర్‌టీ టీమ్, అటవీ శాఖ అధికారులు పులి కోసం ఆయా ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారని, ట్రప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి ఎ.సూరిబాబు, బీట్ ఆఫీసర్ కార్తిక్, పలువురు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


