బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సర్వీసులు క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద వైద్యారోగ్యశాఖ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న ధర్నా మూడో రోజు కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని, ఉద్యోగి మరణిస్తే రూ.50 లక్షల ఇవ్వాలని, మెడికల్ లీవులు, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ చేయాలన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేందుకు 30 రోజులు గడువు కోరిందని, ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నియమించిన కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్ర జేఏసీ కార్యాచరణ మేరకు అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులు బహిష్కరించినట్లు చెప్పారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులకు కాకినాడ బార్ అసోసియేషన్ నాయకులు మద్దతు పలికారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని బార్ అసోసియేషన్ నాయకులు కోరారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు టి.ప్రశాంతి, కె.రాజు, బి.నాగేశ్వరావు పాల్గొన్నారు.


