జిల్లాలోని పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని రామేశం మెట్ట గ్రావెల్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పెద్దాపురం మండలంలోని వాలుతిమ్మాపురం, కొండపల్లి, ఆనూరు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ఈ మెట్ట వద్ద గ్రావెల్ తవ్వకాలు కేజీఎఫ్‌కు మించిపోయాయి. ఎక్కడ చూసినా మట్టి తవ్వేయడంతో అగాధాల్లాంటి పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. ఏకంగా 100 అడుగుల లోతు వరకు కూడా తవ్వకాలు జరిగాయంటే.. అక్రమార్కులు ఏవిధంగా బరి తెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మట్టి అడ్డగోలుగా తవ్వేయడంతో విద్యుత్ స్తంభాలు గాల్లో వేలాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. భారీ వృక్షాల వేర్లు దర్శనమిస్తున్నాయి. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఇక్కడ గ్రావెల్ మాఫియా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కూటమి ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో అధికారులు సైతం తూతూమంత్రంగా దాడులు చేసి, ఆపై మిన్నకుండిపోతున్నారు. తిరిగి మరుసటి రోజే మట్టి మాఫియా మళ్లీ అక్రమ తవ్వకాలు చేపడుతోంది. ప్రతి రోజూ 500 లారీల గ్రావెల్ అక్రమంగా తరలిపోతోంది. గ్రావెల్ నాణ్యతను బట్టి లారీ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముతున్నారు. రూ.12 వేలు లెక్క వేసుకున్నా.. రోజుకు రూ.60 లక్షల విలువ చేసే మట్టి తరలించేస్తున్నారు. అంటే నెలకు రూ.18 కోట్లకు పైగా కూటమి నేతలు అక్రమంగా కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఓ టీడీపీ, ఓ జనసేన ప్రధాన నేతలున్నట్లు సమాచారం. వారి కనుసన్నల్లోనే ఈదందా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


