రైతులకు వరంగా మారాల్సిన పోలవరం కాలువ.. కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. కాలువ తవ్వకం ద్వారా వచ్చిన మట్టిని కూటమి నేతలు ఎక్కడికక్కడ కొల్లగొడుతున్నారు. అది చాలదన్నట్లు అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్ వెనుక ఉన్న పోలవరం కాలువ గట్లను సైతం భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. ఇక్కడ తవ్వేసిన మట్టిని రాత్రి, పగలు అనే తేడా లేకుండా రాజమహేంద్రవరం, కాకినాడ, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు లే అవుట్లు, నర్సరీలు, ఇటుక బట్టీలకు లారీలు, టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు సుమారు 300కు పైగా లారీల మట్టి రహదారి పనులకు తరలిపోతోంది. అంటే రోజుకు రూ.60 లక్షలు.. నెలకు రూ.1.80 కోట్ల మేర కూటమి నేతలు కొల్లగొడుతున్నట్లు అంచనా. అధికార పార్టీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితుల కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది.


