కాకినాడ రూరల్: ఆదివారం సెలవు రోజు కావడంతో ఆనందంగా గడుపుదామని ఆ నలుగురు యువకులు వచ్చారు.. సముద్రం వద్దకు వెళ్లి కెరటాలను చూసి మురిసిపోయారు.. సరదాగా స్నానాలు చేద్దామని దిగారు. ఆ సరదా ఎంతో సేపు నిలవలేదు. రాకాసి కెరటాలు అందులో ఇద్దరిని లోపలకు తీసుకుపోయాయి. ఈ ఘటన కాకినాడ రూరల్ మండలం చీడిగ, ఇంద్రపాలెం గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీనిపై తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ మండల పరిధిలో సూర్యారావుపేట ఓల్డ్ ఎన్టీఆర్ బీచ్ కొద్ది దూరంలో గుర్రాల బీచ్ ఉంది. ఇక్కడ స్నానాలకు పెద్దగా జనాలు రారు. అక్కడకు నలుగురు యువకులు వెళ్లారు. స్నానం చేద్దామని సముద్రంలోకి ఇంద్రపాలెం గ్రామానికి చెందిన పడాల యువకిశోర్ (20), చీడిగ గ్రామంలో నివాసం ఉంటున్న అనుసూరి వీరబాబు (21) దిగి, గల్లంతయ్యారు. వీరబాబు కవల సోదరుడు శ్రీగణేష్ సాయిరామ్, ఇంద్రపాలెం గ్రామానికి చెందిన మరో యువకుడు కాదా ఆదిత్య వెంకట సందీప్ కుమార్‌లు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు ఉప్పునీరు ఎక్కువగా తాగడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. గల్లంతైన పడాల యువకిశోర్ విద్యుత్‌నగర్ ఐడియల్ కళాశాలలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మరో యువకుడు అనుసూరి వీరబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటన జరిగిన బీచ్ వద్దకు చేరుకుని గల్లంతవ్వడానికి గల కారణాలను ఆరా తీశారు. వీరి ఆచూకీ కోసం మత్స్యకారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టేందుకు చర్యలు చేట్టారు. ఈ విషయం తెలుసుకున్న గల్లంతైన యువ కిశోర్ తండ్రి వీరేష్, వీరబాబు తండ్రి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు సముద్రం వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ బిడ్డలను కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. కవల సోదరులు వీరబాబు, శ్రీగణేష్ సాయిరామ్‌ల కుటుంబం ఇటీవలే చీడిగ నివాసం వచ్చిందని, సొంతూరు కరప మండలం గొడ్డటిపాలెం అని చెబుతున్నారు. వీరు హైదరాబాద్‌లో కొన్నేళ్లపాటు మకాం ఉండి ఇక్కడకు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ముల్లో వీరబాబు గల్లంతు కాగా జీజీహెచ్‌లో శ్రీగణేష్ సాయిరామ్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్‌కుమార్ తెలిపారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, మైరెన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
కేకేలు వేసి.. కాపాడి
ఆ నలుగురు యువకుల్లో సందీప్‌కుమార్ బయటికొచ్చి కేకలు వేయడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు, కెమెరా మ్యాన్ వెళ్లి సాయిరామ్‌ను కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు అంటున్నారు.
చికిత్స పొందుతున్న
శ్రీగణేష్ సాయిరామ్
పడాల
యువకిశోర్ (ఫైల్)
జీజీహెచ్‌లో కోలుకుంటున్న కాదా ఆదిత్య సందీప్‌కుమార్
ఫ సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు
ఫ ప్రాణాలతో బయటపడిన
మరో ఇరువురు
ఫ సూర్యారావుపేట బీచ్‌లో ఘటన


