సాక్షి ప్రతినిధి, కాకినాడ: బియ్యం ధర చూస్తే భయమేస్తోంది.. అంతకంతకూ కొండెక్కుతోంది.. పెరిగిన నిత్యావసరాలతో, గంజి నీళ్లతోనైనా కడుపు నింపుకొందామంటే, ధరల మంట కడుపుమాడ్చే పరిస్థితి తీసుకువస్తోంది. బహిరంగ విపణిలో మూడు మాసాలుగా ౖపైపెకి ఎగబాకుతున్న సన్నబియ్యం ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. నెలల వ్యవధిలోనే క్వింటాలుపై రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వరి దిగుబడి గణనీయంగా తగ్గుముఖం పడుతుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీంతో ముందుగానే బియ్యం కొనుగోలు చేసి పెట్టుకోవాలన్న ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు సన్నబియ్యం ధరలు భారీగా పెంచేసినట్లు తెలిసింది. దీనికితోడు సోనా మసూరి, బీపీటీ, ఐఆర్ 64 తదితర రకాల బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఈ బియ్యం పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతోంది. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. సన్నబియ్యం ధరలు మూడు నెలలుగా భారీగా పెరిగాయి. ఈ ఏడాది మే 1వ తేదీ నాటితో పోలిస్తే పాత బియ్యం 26 కిలోల బస్తాపై రూ.200 నుంచి రూ.300 వరకు ధర పెరిగింది. క్వింటాలు సన్న బియ్యం మే 1న రూ.5,600 నుంచి రూ.5,800 వరకు విక్రయించేవారు. ప్రస్తుతం వాటి ధర రూ.6,500 నుంచి రూ.7,500 వరకు పలుకుతోంది. సాధారణ రకం బియ్యం ధర క్వింటాలుకు రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెరిగింది. బీపీటీ రకం క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.5,750కు చేరింది.
ధరల నియంత్రణలో విఫలం
కాకినాడ జిల్లా వ్యాప్తంగా 1,060 రేషన్ షాపుల పరిధిలో 6.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా వినియోగదారులకు 9,450 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెలా సరఫరా చేస్తున్నారు. సన్న బియ్యం ధరలు పెరుగుతున్నా.. నియంత్రణకు కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. వ్యాపారులు ధరలు పెంచకుండా అడ్డుకట్ట వేయడంపై కనీస శ్రద్ధ పెట్టడం లేదు. ఈ విషయమై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కంటితుడుపు చర్యలకు దిగింది. ప్రత్యేక కేంద్రాల ద్వారా రాయితీపై బియ్యం అందజేస్తామని ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లా నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. తిరిగి ప్రధాని మోదీ సభ పేరుతో వాయిదా వేసింది.
సేకరణ సాధ్యమేనా..?
ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాల ద్వారా స్టీమ్‌రైస్ అందజేస్తామని ప్రకటించింది. అయితే సేకరణ సాధ్యమేనా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ వద్ద 18,433 మెట్రిక్ టన్నుల స్టీమ్‌రైస్ ఉంది. ప్రస్తుతమున్న స్టాక్‌లో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నెలకు 421 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేస్తున్నారు. పీడీఎస్ స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలంటే, ఏడాదికి సుమారు 1.13 లక్షల మెట్రిక్ టన్నుల వరకు బియ్యం అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో బియ్యం సేకరించే పరిస్థితి కనిపించడం లేదు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 120 రైస్ మిల్లులు ఉన్నాయి. జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లు స్టీమ్ రైస్ సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అలాంటి సందర్భంలో ఎగుమతులకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. ప్రభుత్వానికి తక్కువ ధరకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొందరి కబందహస్తాల్లోనే..
కూటమి ప్రభుత్వం బియ్యం సరఫరా, తదితర వ్యవహారాలను కొందరి కబంద హస్తాల్లో పెట్టింది. వారి కనుసన్నల్లోనే బియ్యం ధరల పెంపు నిర్ణయాలు జరుగుతున్నాయి. మిల్లర్లను సైతం వాళ్లే శాసిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
కొత్త బియ్యం కూడా..
అధిక శాతం ప్రజలు పాత బియ్యం వినియోగానికే మొగ్గు చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాత బియ్యం లభించక కొత్త బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు కొత్త బియ్యం ధరలను సైతం పెంచేశారు. 26 కిలోల బస్తాకు రూ.400 నుంచి రూ.600 వరకు పెంచి విక్రయిస్తున్నారు. గతంలో 26 కిలోల కొత్త బియ్యం ధర రూ.1,410 నుంచి రూ.1,460 వరకు ఉండగా.. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.1,750 పలుకుతోంది. అదే బీపీటీ రకమైతే.. రూ.1,250 ఉన్న బస్తా, రూ.1,480కు విక్రయిస్తున్నారు. హెచ్‌ఎంటీ రకం 26 కిలోల బస్తా సైతం రూ.1,550 నుంచి రూ.1,800కు పెరిగింది.
అమాంతం పెరిగిన సన్నబియ్యం ధర
26 కిలోల బస్తాపై
రూ.200 నుంచి రూ.300 అధికం
గగ్గోలు పెడుతున్న వినియోగదారులు
నియంత్రణలో చంద్రబాబు
ప్రభుత్వం విఫలం


