అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత, లఘున్యాస అభిషేకాల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు గరిక పూజ, నలుగురు ఉండ్రాళ్ల పూజ, 61 మంది లక్ష్మీగణపతి హోమం నిర్వహించుకున్నారు. ఓ చిన్నారికి నామకరణం, ఒకరికి అన్నప్రాశన, తులాభారం నిర్వహించారు. నూతన వాహనాలకు పూజలు జరిపారు. అన్నప్రసాదం 2,885 మంది భక్తులు స్వీకరించారు. అన్నప్రసాద విరాళాలు, ప్రసాదాలు, పూజా టికెట్ల విక్రయం ద్వారా రూ.3,74,580 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, సహాయ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
‘పింగళి’ ఆశయాలు ఆదర్శం
అమలాపురం టౌన్: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఆశయాలు నేటి యువతకు ఆదర్శనీయమని కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయ ణ అన్నారు. కోనసీమ రచయితల సంఘం, పి.గన్నవరం మమతా స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఆదివారం జరిగిన పింగళి వెంకయ్య జయంతి సభలో ఆయన మాట్లాడారు. శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, విశ్రాంత డీఐఈవో వనుము సోమశేఖరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మమతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ జాన్, దివ్యాంగుల మహా సంఘటన్ అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్, గ్రంథాలయ అసిస్టెంట్ పోలిశెట్టి సత్యనారాయణ, కవులు, రచయితలు పాల్గొని, పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు.
యానాంలో..
యానాం: సమాచార శాఖ ఆధ్వర్యాన ఆదివారం పింగళి వెంకయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫెర్రీ రోడ్డులోని ఆ మహనీయుని విగ్రహానికి యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి శివరాజ్‌మీనా, సీఐ డి.సురేష్‌బాబు, ఎస్సై కుమరన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రివర్ ఫ్రంట్ పనుల తనిఖీ
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపడుతున్న రివర్ ఫ్రంట్ పనులను వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆదివారం తనిఖీ చేశారు. స్థానిక మార్కండేయ స్వామి గుడి సమీపంలో గోదావరి వద్ద రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలు ఎందుకు వేశారని కార్పొరేషన్ ఈఈ అలీని ప్రశ్నించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నప్పుడు ఇసుక బస్తాలు వేసి ఎందుకు అడ్డుకట్ట వేశారని అడిగి తెలుసుకున్నారు. గోదావరి గట్టు లోపలకు తవ్వి పనులు చేస్తున్నప్పుడు ఇసుక బస్తాలు వేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. దీనిపై ఈఈ మాట్లాడుతూ గోదావరికి వరద అధికంగా వస్తున్న నేపథ్యంలో పనుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఇసుక బస్తాలు వేశామని వివరించారు. అనంతరం అక్కడి నుంచి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి గోదావరి వరద ప్రవాహం, ప్రమాద హెచ్చరికల జారీ, తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగానే సూచనలు ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం, మార్గాని సురేష్, మదీనా బాషా తదితరులు ఉన్నారు.


