మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
అనపర్తి: బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనికి భయపడేది లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రామవరంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఇంటికి పరామర్శకు వెళ్లిన తమపై స్వయంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హైడ్రామాను సృష్టించారన్నారు. అనంతరం తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులకు పాల్పడి, తిరిగి తమపై అక్రమంగా కేసులు పెట్టారన్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, తాము వెనకడుగు వేసేది లేదని.. రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు మనోజ్‌రెడ్డి అక్రమాలు, అవినీతిని బయటపెడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. కృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నాయకులు, కార్యకర్తలు వెళ్తున్న సమయంలోనే ఎమ్మెల్యే కూడా వచ్చి ఉద్దేశపూర్వకంగా రగడ చేశారని, ఆ దృశ్యాలన్నీ ప్రజలు వీడియోల ద్వారా చూశారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి, తనతో సహా 15 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆ గ్రామంలోని మిగతా బాధితుల ఇళ్లకు కానీ, గతంలో రంగాపురం, దొడ్డిగుంట గ్రామాల్లో హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శించడానికి గాని ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అక్కడకు వెళ్తే ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుందనే భయంతోనే ఎమ్మెల్యే వెళ్లలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూర్యనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. వీఆర్‌ఓ వంటి అధికారులతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి కేసులు నమోదు చేయించడం సరికాదని, సంఘటన స్థలంలో ఉన్న పోలీసులకు నిజమేంటో స్పష్టంగా తెలుసన్నారు. వైఎస్సార్ సీపీ సమర్పించిన సీసీటీవీ ఫుటేజ్, ఆధారాలపై ఇప్పటివరకు ఎలాంటి సమగ్ర విచారణ చేపట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి అక్రమ కేసులు పెట్టే వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు
అనపర్తి పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన రామవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఇంటిపై జూలై 12న కూటమి నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 14న కృష్ణారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ శ్రేణులు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నేత కృష్ణారెడ్డి ఇంటి వైపునకు దూసుకొచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సూర్యనారాయణరెడ్డి సహా పలువురు పార్టీ నాయకులపై స్థానిక వీఆర్వో దుర్గారెడ్డి ఫిర్యాదు మేరకు అనపర్తి పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం నోటీసులు అందజేశారు.


