పోడుపొచ్చాలు | - | Sakshi
Sakshi News home page

పోడుపొచ్చాలు

Aug 3 2026 12:19 AM | Updated on Aug 3 2026 12:19 AM

సత్యగిరిని ఆనుకుని ఉన్న కొండను చదును చేసి నాటిన మామిడి మొక్కలు

సత్యగిరిని ఆనుకుని పోడు వ్యవసాయం

ఆ భూమి ఎవరిదో తేల్చాలని

రెవెన్యూకు దేవస్థానం లేఖ

అన్నవరం: స్థానిక సత్యగిరిని ఆనుకుని పోడు వ్యవసాయం చేయడం చర్చనీయాంశమైంది.. అసలు భూమి ఎవరిదో తేల్చమని దేవస్థానం రెవెన్యూ అధికారులను కోరడం శోచనీయం. అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యగిరిని ఆనుకుని కొండను కొందరు చదును చేసి, పోడు వ్యవసాయం ప్రారంభించారు. ఆ భూమి రైతులకు గతంలో ఇచ్చిన డీ పట్టా భూమి అని కొందరి వాదన ఉండగా, దేవస్థానానికి సంబంధించిన భూమి కొంత కలిసిపోయిందనే అభిప్రాయం మరికొందరి నుంచి వ్యక్తమవుతోంది. సత్యదేవుని గిరిప్రదక్షిణ రోడ్డులో పంపా ఘాట్‌కు చేరుకునే మలుపు దాటాక పక్కనే ఉన్న కొండను ఆనుకుని కొంతమంది అరెకరం భూమిని కొండపోడు చేశారు. కొండపైకి వెళ్లేందుకు జేసీబీతో మార్గం ఏర్పాటు చేసుకుని, అదే జేసీబీతో కొండను చదును చేశారు. అక్కడ మామిడి మొక్కలు నాటి, వాటికి నీటి కోసం ప్లాస్టిక్‌ టబ్‌లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఆ కొండపోడుకు అతి సమీపంలోనే దేవస్థానం ఆగమ పాఠశాల ఉంది. దానికి కొద్దిమీటర్ల దూరంలో దేవస్థానం కొండ సరిహద్దుగా రాళ్లతో పేర్చిన గోడ ఉండేది. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోడ పడిపోయిందా, ఎవరైనా పడగొట్టారా అనేది తేల్చాల్సి ఉంది.

స్పష్టత లేకే..

కాగా, దేవస్థానానికి చెందిన కొండలను పోలవరం కాంట్రాక్టర్‌ తవ్వేస్తున్నారని వారం క్రితం వరకు కొంతమంది ప్రచారం చేశారు. అయితే పోలవరం కాంట్రాక్టర్‌ తవ్వేది వారి స్థలంలోని మట్టినే అని నిర్థారణ అయ్యింది. ఇప్పుడు దేవస్థానం భూమిని ఆనుకుని పోడు వ్యవసాయం చేస్తున్నారని అంటున్నారు. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు లేకుండా సత్యగిరిని ఆనుకుని పక్కా గోడ నిర్మించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గిరిప్రదక్షిణ రోడ్డు నుంచి దేవస్థానం వరకు ఉన్న కొండలను దేవస్థానం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తే, భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు రావనే వాదన వినిపిస్తోంది.

కొండపైకి వెళ్లేందుకు జేసీబీ ద్వారా తయారు చేసిన రోడ్డు

ఎవరిదో తేల్చాలని కోరాం

ఈ పోడు వ్యవసాయం మా దృష్టికి వచ్చింది. ఆ భూమిని పరిశీలించాం. ఈ భూమి డీ పట్టా పొందిన రైతులదా లేకుంటే దేవస్థానానిదా అనే విషయం తేల్చాలని రెవెన్యూ అధికారులను కోరాం. వారు సోమవారం వచ్చి రికార్డులు పరిశీలించి ఏ విషయం తెలియజేస్తామన్నారు. ఆపై తదుపరి చర్యలు తీసుకుంటాం.

– నల్లం సూర్యచక్రధరరావు,

ఈఓ, అన్నవరం దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement