● డీఎస్సీలో మీ తప్పు లేనప్పుడు
విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు
● భయపడే విద్యాశాఖ అధికారులతో సమావేశాల ఏర్పాటు
● మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్: డీఎస్సీలో మీ తప్పు లేనప్పుడు విచారణకు ఎందుకు ఆదేశించడంలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో అవకతవకలు జరగలేదని, అదేదో పవిత్ర కార్యక్రమంలా చెప్పుకోవడానికి ప్రభుత్వం పడుతున్న పాట్లు చూస్తే నవ్వు వస్తోందన్నారు. అడ్డంగా దొరికిపోయి తప్పించుకునే కార్యక్రమంలో క్షేత్ర స్థాయి వరకు చివరకు ఉపాధ్యాయులతో ఖండించే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక వాయిస్ మెసేజ్‌ను గ్రూపుల్లో పంపించి సోమవారం కుళాయి చెరువు వద్ద కన్వెన్షన్ హాలులో మీటింగ్‌కు రావాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, 2025 డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారిని ఆహ్వానించారన్నారు. తెలుగుదేశం నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో వైఎస్సార్ సీపీపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారన్నారు. డీఎస్సీ అక్రమాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అధికారులతో మాట్లాడిస్తున్నారని, మంత్రులు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు ఆధారాలతో బయట పడ్డాయని, ఇంకా కొందరికి మేలు చేయడం కోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇన్వాల్వ్ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందన్నారు. మీ తప్పులేనప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదన్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలతో పెద్ద పెద్ద సభలు ఎందుకు పెడుతున్నారు? ఇది భయపడడం కాదా.. మీ చేతకాని తనం కాదా అని కన్నబాబు ప్రశ్నించారు. తప్పు జరగలేదని అనిపిస్తే జ్యూడిషియల్ లేదా సీబీఐ విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా అందరినీ కూడగట్టడానికి విద్యాశాఖ అధికారులకు ఏం సంబంధమన్నారు. తప్పు జరగలేదని చెప్పలేకపోతున్నారని, డీఎస్సీ అనేది తప్పకుండా ఒక దగా స్కామ్ అని జగన్ చెప్పింది వాస్తవమన్నారు.
డీఎస్సీలో
అవకతవకలపై ‘సాక్షి’తో
మాట్లాడు తున్న
మాజీ మంత్రి కన్నబాబు


