ఇదేం ‘బరి తాగింపు’పై కమిషనర్ సీరియస్
రాజమహేంద్రవరం సిటీ: నగరం నడిబొడ్డున ఉన్న నగరపాలక సంస్థ మున్సిపల్ స్టేడియంలో పట్టపగలు బహిరంగంగానే మద్యం తాగుతూ సందర్శకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ‘ఇదేం బరి తాగింపు’ శీర్షికన సోమవారం సాక్షిలో కథనం వెలువడటంతో నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్‌మీనా సీరియస్ అయ్యారు. తక్షణమే చర్యలు చేపట్టాలంటూ పోలీసు అధికారులకు లేఖ రాశారు. దీంతో మందుబాబుల ఆగడాలు కట్టించేందుకు మఫ్టీలో పోలీసులు చర్యలు చేపట్టారు. చీకటి సమయంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మున్సిపల్ స్టేడియంలో డోన్ ఎగురవేసి నిఘా నిర్వహించారు. సాక్షి కథనంతో అప్రమత్తమైన నగరపాలక సంస్థ అధికారులు మున్సిపల్ స్టేడియంలో పూర్తిస్థాయి నిఘా పెంచాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాత్రి సమయాల్లో గోడలు దూకి లోనికి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది.


