
పంపకాల్లో పచ్చపాతం!
● యూరియా పంపిణీలో తమ్ముళ్ల చేతివాటం
● అన్నదాతలకు మొండిచేయి
● పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాలలు
● కొనసాగుతున్న ఆందోళనలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: యూరియా పంపిణీలో కూటమి పాలన తీరు శ్రీదున్నపోతుపై వర్షం కురిసినశ్రీ చందంగా ఉంది. చేలలో మందు వేద్దామంటే యూరియా లేక రైతులు నరకం చూస్తున్నారు. చేతికొచ్చిన పంట చేజేతులా వదిలేసుకునే పరిస్థితి ఎదురవుతోందని అన్నదాత దిగులు చెందుతున్నాడు. అన్నింటా మాదిరిగానే యూరియా పంపిణీలో సైతం తెలుగు తమ్ముళ్ల పెత్తనం పరాకాష్టకు చేరుకుంది. యూరియా కొరతతో అదను దాటిపోతోందని ఆందోళన చెందుతున్న రైతులకు తెలుగు తమ్ముళ్లు చుక్కులు చూపిస్తున్నారు. అరకొర ఎరువులను సైతం నయానా, భయానా వ్యవసాయాధికారులను అదిరించి, బెదిరించి దొడ్డిదారిన తమ వారికి ధారాదత్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ పర్యవేక్షణలో ఏడీలు, ఏఓలు, వీఏఓలు కోటా ప్రకారం విడుదలయ్యే యూరియాను ముందుగా టోకెన్లు ఇచ్చి క్యూలో ఉన్న రైతులకు ఒకరి తరువాత ఒకరికి ఆధార్‌కార్డు పరిశీలించి పంపిణీ చేయాలి. కానీ కూటమి నేతలు ఈ ప్రక్రియన తమ చేతుల్లోకి తీసుకుని తెల్లవారుజాము నుంచి క్యూలైన్‌లో ఉన్న రైతులను గాలికి వదిలేసి తమ అనుచరులకు లెక్కా పత్రం లేకుండా బస్తాల కొద్దీ యూరియా దోచిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ రైతులకే యూరియా లేక నానా కష్టాలు పడుతున్నారు. పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల్లో రైతులు పొలాల్లో రెండో విడత యూరియా వేసేందుకు సిద్ధమైనా యూరియా దొరకక ఆందోళనలో ఉన్నారు. పిఠాపురం నియోజవర్గం మొత్తానికి ఈ సీజన్‌లో 4,175 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు 3037.55 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జరుగుగున్న రెండో దశ పంపిణీకి అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయంటున్నారు. అటువంటప్పుడు శనివారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రైతులు యూరియా కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రైతు ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం కోటా ప్రకారం 20 టన్నుల యూరియా వచ్చింది. ఒకరికి ఒక బస్తా మాత్రమే ఇస్తారని తెలిసి ఆ పీఏసీఎస్ వద్దకు తెల్లవారుజామున ఐదుగంటల నుంచే రైతులు లైన్ కట్టారు. కొందరు ఆధార్ ఒరిజినల్, కొందరు జిరాక్స్ తీసుకువచ్చారు. పీఏసీఎస్‌లో ఇదివరకు ఆధార్ కార్డులు దొంతరగా పెట్టి పేరు, పేరునా పిలిచి ఇచ్చేవారు. ఈసారి కూటమి నేతలు పీఏసీఎస్‌లో యూరియా పంపిణీని తమ చేతుల్లోకి తీసుకుని సుమారు 100 బస్తాలు యూరియాను అడ్డగోలుగా తమ పార్టీ నేతలకు పంచేశారు. అంతటితో ఆగకుండా వ్యవసాయశాఖ అధికారుల చేతుల్లో ఉన్న కూపన్లను సైతం లాగేసుకుని మరీ తమపార్టీ వారికి పంపిణీ చేసేశారు. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా ఏడీ స్వాతి, ఏఓ సత్యనారాయణ చేష్టలుడిగి చూడటంతో రైతులు విస్తుబోయారు. కోపోద్రిక్తులైన రైతులు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు ఆద్వర్యంలో ఆందోళనకు దిగడంతో అధికారులు దిగివచ్చి మిగిలిన యూరియాను టోకెన్ల వారీగా అందరికీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. జిల్లాలో యూరియా పంపిణీలో కూటమి నేతల పెత్తనానికి చేబ్రోలు సంఘటన ఒక ఉదాహరణ. జిల్లాలో మిగిలిన మండలాల్లో సైతం కూటమి నేతల అనుచరులకు యూరియా వరప్రదాయినిగా మారింది.

పంపకాల్లో పచ్చపాతం!