
ఉప్పాడ తీర ప్రాంతం పరిశీలన
కొత్తపల్లి: సముద్రపు అలలు ఉధృతి కారణంగా గ్రామంలో చొచ్చుకు వచ్చిన ముంపు నీరును తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఉప్పాడ తీర ప్రాంతం, కోతకు గురవుతున్న బీచ్‌రోడ్డును శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానికంగా ఉన్న మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలల ఉధృతితో తీర ప్రాంతంలో ఉన్న తాము భయపడుతున్నామని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మహిళలు కోరారు. ఆయన మాట్లాడుతూ సముద్రపు అలలు ఉధృతి కారణంగా తీర ప్రాంత గ్రామాలైన సుబ్బంపేట, రంగంపేట, కొత్తపట్నంలో గత రెండు రోజుల నుంచి నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనిపై ప్రత్యామ్నాయంగా ముంపు నీరు పోయేందుకు, కాలువలు తవ్వేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందన్నారు. తీరప్రాంత శాశ్వత రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. బీచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉందని రోడ్డుపై రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ మల్లిబాబు, పంచాయతీరాజ్ డీఈ సిద్ది వెంకటేశ్వరావు, తహసీల్దారు చిన్నారావు, ఎంపీడీఓ లక్ష్మీరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ రమణ పాల్గొన్నారు.