
జిల్లా పేరే మార్చేశారు.. స్మార్ట్‌గా!
అమలాపురం టౌన్: అత్యంత ఆధునిక, సాంకేతిక, పారదర్శకతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులతో సరుకులను పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం వాటి ముద్రణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును విస్మరించింది. జిల్లాలో పంపిణీకి సిద్ధమైన 5,31,926 స్మార్ట్ కార్డుల్లో కొన్నింటిపై జిల్లా పేరు కాకుండా తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించడం విమర్శలకు తావిస్తోంది. ఈ కార్డులపై ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని మరీ ఈ తప్పిదానికి పాల్పడడం శోచనీయం. జిల్లా 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఇప్పటికి మూడేళ్లు దాటినా జిల్లా పేరుకున్న గౌరవాన్ని తగ్గించేలా ఇంకా తూర్పుగోదావరి జిల్లాగా వాటిపై ముద్రించడం శోచనీయం. ఇప్పటికే ఈ కార్డుల పంపిణీ మొదలైంది. వాటిపై జిల్లా పేరు తప్పుగా పడడం వల్ల తమకు రేషన్ ఇస్తారో లేదోనని లబ్ధిదారులు కంగారు పడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయడం ఇష్టం లేక తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారా అని జిల్లాకు చెందిన కొందరు ఎస్సీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తక్షణమే కార్డులపై తమ జిల్లా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే సమయంలో ఆధార్ ఆధారంగా ఓటీపీ లేదా బయోమెట్రిక్‌తో పొందే వీలుంటుదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.దయ భాస్కర్ చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన కొన్ని కార్డుల్లో మాత్రమే తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారని, ఈ తప్పిదాలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. దీనివల్ల స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
రేషన్ కార్డుల్లో పేరు
మార్పుపై లబ్ధిదారుల ఆందోళన