
చేనేత.. సమస్యల కలబోత
చేనేతను ఆదుకోవడం
సామాజిక బాధ్యత
చేనేత వృత్తి పరిరక్షణ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా పరిగణించాలి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న చరిత్ర అంగర చేనేత సహకార సంఘం సొంతం. అటువంటి సొసైటీకి ఆప్కో నుంచి రూ.కోటి పైగానే బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము విడుదల కాకుంటే సంఘం మూతపడే ప్రమాదం ఉంది.
– గుడిమెట్ల శివరామకృష్ణ, మాజీ చైర్మన్,
శ్రీ గణపతి చేనేత పారిశ్రామికుల
సహకార సంఘం, అంగర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేనేత కుటుంబాలు బకాయిల గుదిబండతో చితికిపోతున్నాయి. గడచిన 10 నెలలుగా పైసా కూడా విదల్చక పోవడంతో చేనేత సహకార సంఘాలు మూత వేసుకునే దుస్థితి ఏర్పడింది. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ అన్ని పథకాలు అమలు చేశామంటూ కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. సూపర్ సిక్స్ అమలుమాట దేవుడెరుగు కనీసం అప్పులు కూడా పుట్టక చేనేత రంగం కుదేలైందని చేనేత కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. చంద్రబాబు సర్కార్ గద్దె నెక్కి 14 నెలలు దాటిపోయినా బకాయిలు విడుదల చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చేనేతలు చేతిలో చిల్లిగవ్వ లేక నూటికి రూ.8ల వడ్డీతో అప్పుల కోసం రోడ్డెక్కే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. సంప్రదాయంగా చేనేత ఉత్పత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముందుకు వెళదామంటే నుయ్యి, వెనక్కు వద్దామంటే గొయ్యి అన్న సామెత చందంగా నేతన్నల పరిస్థితి తయారైంది. అనేక చేతివృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచి పోరాడుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు మూరల చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఈ ప్రాంతంలో చేనేతల జీవితం కష్టాలు, కన్నీళ్లు కలబోతగా మారింది. ఈ దుస్థితికి కూటమి ప్రభుత్వం నిర్వాకం కూడా కారణమని చేనేత సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు.
ఉచిత విద్యుత్ ఉత్తిమాట
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 పైబడే చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయి. ఈ సంఘాల పరిధిలో చేనేత కుటుంబాలు ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, రామచంద్రపురం మండలం ఆదివారపుపేట, అంగర, పులుగుర్త, వడిశలేరు, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, ముమ్మిడివరం, క్రాపచింతలపూడి శివారు కె జగన్నాథపురం, బండార్లంక తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల పరిధిలో జరిగే లావాదేవీలపై సుమారు 13వేల చేనేత కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఉమ్మడి తూర్పున పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్‌లో సంఘాలు మనుగడ సాగిస్తాయనేది నిర్వివాదాంశంగా పేర్కొటున్నారు. గతంలో మాదిరిగా సంఘాలు ఇక ముందు కూడా సక్రమంగా నడవాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కలిసి సంఘాలకు రావాల్సిన రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయాలంటున్నారు. తనతోనే చేనేత రంగం ప్రగతిబాటలో పయనించిందని గొప్పలకు పోతోన్న చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బకాయిలు విడుదల చేసి మాట్లాడాలంటున్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు 200 యూనిట్‌ల వినియోగం వరకు విద్యుత్ ఉచితమని చంద్రబాబు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందుకు భిన్నంగా 100 యూనిట్లకు పైబడి వినియోగించిన వారికి విద్యుత్ బిల్లులు సెప్టెంబర్ నెలలో చేతిలో పెట్టారని చేనేత కార్మికులు మండిపడుతున్నారు.
పెట్టుబడులు పెట్టే స్తోమత లేక..
ఉమ్మడి జిల్లాలో ఒకో సంఘానికి తక్కువలో తక్కువ రూ.ఏడెనిమిది లక్షల నుంచి రూ.90 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురం మండలంలోని ఒక్క అంగర చేనేత సహకార సంఘానికే రూ.90 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. జాతీయ స్థాయిలో రెండు పర్యాయాలు అవార్డు దక్కిన అంగర చేనేత సహకార సంఘం దుస్థితి ఇలా ఉంటే మిగిలిన సంఘాల పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈ సంఘాలలో సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు ఆప్కో నుంచి రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి తమ పొట్టకొడుతోందని చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయక, పెట్టుబడులు పెట్టే స్థోమత లేక, బయట మార్కెట్‌లో రూ.8ల వడ్డీకి అప్పులు తెచ్చే సాహసం చేయలేక చివరకు సొసైటీలను మూసేసే దుస్థితి దాపురించిందని నేతన్నలు అంటున్నారు.
ఎన్నికల్లో కూటమి నేతన్నలకు ఇచ్చిన హామీ ఉచిత విద్యుత్. గద్దె నెక్కి 14 నెలలు దాటినా అమలు చేయకుండా సర్కారు దగా చేసింది. సాధారణ మగ్గాలపై ఉచిత విద్యుత్‌ను మరో 100 యూనిట్‌లకు పెంచుతున్నామని చెప్పారే తప్ప ఆచరణలో అమలుకునోచుకోలేదు. కానీ గత నెల7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చేసినట్టు చంద్రబాబు చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా సెప్టెంబర్ నెలలో 100 యూనిట్లు దాటిన విద్యుత్ బిల్లులు చేతిలో పెట్టి ఉచిత విద్యుత్ అమలుచేయకుండా కూటమి సర్కార్ మోసం చేస్తోందని నేతన్నలు విమర్శిస్తున్నారు. ఈ పథకం అమలుచేయకపోవడంతో ఏడాదిగా సుమారు రూ.4కోట్ల రాయితీ ఎగ్గొట్టేసిందని చేనేత ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ముడినూలు కొనుగోలు సమయంలో చేనేత కార్మికులు 5శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఈ కారణంగా చీరల ధరలు పెంచడంతో మార్కెట్‌లో విక్రయాలు మందగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వమే 5శాతం జీఎస్‌టీ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయంలో కూడా సర్కార్ నమ్మించి మోసగించిందని, జీఎస్టీ చెల్లించలేదంటున్నారు. ఇందుకు తోడు త్రిఫ్ట్ ఫండ్ మాటే వినిపించడం లేదంటున్నారు. సహకార సంఘాల్లో నేత కార్మికుల ఆదాయంలో 8శాతం మినహాయించి సొసైటీలో జమ చేస్తుంటారు. ఆ మొత్తానికి రెట్టింపు 16శాతం ప్రభుత్వం త్రిఫ్ట్‌ఫండ్ జతచేసి మూడు నెలలకు ఒకసారి కార్మికుల ఖాతాలకు జమ చేస్తుంటుంది. ఈ త్రిఫ్ట్ ఫండ్ రూ.5 కోట్లు విడుదల చేశామని సంబంధిత మంత్రి సవిత ఆరు నెలల క్రితం ప్రకటించడమే తప్ప ఆ సొమ్ము ఎక్కడా తమ ఖాతాల్లో జమ కాలేదని సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ఒక విడత నేతన్న నేస్తం రూ.24వేలు జమ అయ్యేదంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిపోయినా ఏ మాత్రం లబ్ధి చేకూరకపోవడంపై చేనేత వర్గాలు మండిపడుతున్నాయి.
మూసివేత దిశగా సొసైటీలు
‘బాబు’ బకాయి రూ.7 కోట్లు
జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్ ఊసే లేదు
అమలు కాని ఉచిత విద్యుత్ హామీ
అప్పుల ఊబిలో కూరుకుపోతాయి
చేనేత సొసైటీల బకాయిలు విడుదల చేయకుంటే సొసైటీలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. ఇప్పటికే కొన్ని సొసైటీలు నిర్వహించలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. ముడిసరకుపై అదనపు భారం పడుతుండటంతో చేనేత కార్మికులకు మాస్టర వీవర్స్ సొసైటీలు పడుగులు ఇవ్వడం లేదు.
– గోపి హరిబాబు, చేనేత కార్మికుడు, యు.కొత్తపల్లి
బకాయిలు విడుదల చేయాలి
బకాయిలు విడుదల చేయకుంటే సొసైటీ మూతే వేసే పరిస్థితి. సొసైటీలు మనుగడ సాగించేందుకు 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి. ప్రొక్యూర్‌మెంట్ కూడా సక్రమంగా జరగడం లేదు.
– ఉప్పు అర్థనారీశ్వర బులిరాజు,
ఆదివారపుపేట, రామచంద్రపురం మండలం
ఎన్నికల హామీలు అమలు చేయాలి
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు జరపాలి. సంఘాలకు ఎన్నికలు జరపాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.7కోట్లు ఆప్కో ద్వారా సహకార సంఘాలకు బకాయిలను చెల్లించింది.
– జాన జగదీష్ చంద్ర గణేష్,
వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు, కోనసీమ జిల్లా

చేనేత.. సమస్యల కలబోత

చేనేత.. సమస్యల కలబోత

చేనేత.. సమస్యల కలబోత

చేనేత.. సమస్యల కలబోత