ఆమెకు అభయం.. | - | Sakshi
Sakshi News home page

ఆమెకు అభయం..

Sep 15 2025 8:03 AM | Updated on Sep 15 2025 8:03 AM

ఆమెకు

ఆమెకు అభయం..

స్వస్థ నారీ–సశక్త్‌ కుటుంబ అభియాన్‌కి ఏర్పాట్లు

మహిళలకు ఉచితంగా

ఆరోగ్య, వైద్య పరీక్షలు

జిల్లాలో 491 ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహణ

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం

మహిళలు, బాలల

ఆరోగ్య సంరక్షణే లక్ష్యం

కాకినాడ క్రైం: ఆమె బాగుంటే అంతా బాగున్నట్లే. కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, ప్రాంతం కావచ్చు, దేశమే కావచ్చు ఏదైనా ఆమె బాగున్నంత వరకే. మహిళ మనోబలమే భవితను నిర్దేశిస్తుందన్నది నిర్వివాదాంశం. ఆమె ఆరోగ్యం సమాజ, కుటుంబ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి మహిళ ఆరోగ్యం నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సంపూర్ణ ఆరోగ్యం ఓ తీరని కలగా మారింది. అందుకు కారణం, నిత్య జీవితంలో బహుముఖ పాత్రల్లో ఆమె పాటుపడడమే. ఈ పోరాటంలో ఆమె తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సీ్త్ర ఆరోగ్యం తన బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం భావించింది. మహిళా సాధికారత సుస్థిరమవుతున్న తరుణంలో ఆమె ఆరోగ్యానికి అండగా నిలిస్తే మరిన్ని విజయాలు అందిపుచ్చుకోవడంలో దోహదపడవచ్చని కేంద్రం భావించింది. అందులో భాగంగానే స్వస్థ నారీ–సశక్త్‌ కుటుంబ అభియాన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌పిఏ) కార్యక్రమానికి రూపకల్పన చేసింది. జిల్లాలో ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

వైద్య శిబిరాల నిర్వహణ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజనలో భాగంగా అందించే ప్రయోజనాలకు అనుబంధంగా సెప్టెంబర్‌ 17న దేశ వ్యాప్తంగా 8వ రాష్ట్రీయ పోషణ మాసం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు.

నాలుగు దశల్లో సేవలు

మహిళలు, బాలల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఆరోగ్య పరీక్షలు, అలవాట్లు, ఆరోగ్య అనుబంధ ఇతర అంశాలపై అవగాహనతో పాటు ఆరోగ్య సేవలు అందిస్తారు. నాలుగు దశల్లో సేవలు అందిస్తారు. వైద్య, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య నిర్వహణ, ఆరోగ్య అవసరాలను అనుసంధానం చేసే సేవలు, ఆరోగ్య అనుబంధ సామాజిక బాధ్యత ప్రధాన లక్ష్యాలు. వైద్య, ఆరోగ్య పరీక్షల పరిధిలో మహిళకు చెవి, కంటి, రక్తపోటు, మధుమేహం, దంత పరీక్షలు నిర్వహిస్తారు. నోరు, స్థన, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తారు. పిల్లలకు టీకా సేవలు, గర్భిణులకు పరీక్షలు, రక్తహీనత, క్షయ పరీక్షలు, సికిల్‌ సెల్‌ అనీమియా నిర్థాఽరణ చేస్తారు. అలాగే రెండోదైన ఆరోగ్య నిర్వహణ దశలో స్థూలకాయ నియంత్రణ, సహజ, పోషకాహారం, చిన్నారులు, శిశువుల పోషణ పద్ధతులు, శారీరక పరిశుభ్రత అంశాలపై అవగాహన కల్పిస్తారు. మూడో దశలో ఆరోగ్య అనుసంధాన సేవలపై అవగాహన కల్పించి వినియోగించుకునేలా చేస్తారు. టెలీ మెడిసిన్‌, నిపుణుల వైద్య సలహాలు, మాతా శిశు రక్షణ కార్డు, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన నమోదు, ఆయుష్మాన్‌ వయో వందన కార్డు, సికిల్‌ సెల్‌ కార్డు, పోషణ ట్రాకర్‌లో నమోదు, టేక్‌ హోమ్‌ రేషన్‌లో నమోదు చేయిస్తారు. ఆరోగ్య అనుబంధ సామాజిక బాధ్యత అనే నాలుగో దశలో రక్తదానం, అవయవదానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. అలాగే ఆరోగ్య మిత్రల నుంచి అందే సేవలపై అవగాహన కల్పిస్తారు.

491 సెంటర్లు, 526 క్యాంపులు

కాకినాడ జిల్లా వ్యాప్తంగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ పర్యవేక్షణలో 526 శిబిరాలు నిర్వహించేందుకు 491 సెంటర్లు ఎంపిక చేశాం. వీటిలో 410 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, 37 పీహెచ్‌సీలు, 23 యూపీహెచ్‌సీలు, 9 సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. 16 రోజుల పాటు నిర్వహించనున్న స్వస్థ నారీ సశక్త్‌ కుటుంబ అభియాన్‌ నిర్వహణకు సుమారు 2500 మంది క్షేత్రస్థాయి సిబ్బంది. 20 మంది ఆరోగ్య శ్రీ ఎంపానెల్డ్‌ డాక్టర్లు, కాకినాడ జీజీహెచ్‌ నుంచి 50 మంది స్పెషాలిటీ వైద్యులను ఇప్పటికే నియమించారు. శిబిరాల్లో స్పెషలిస్టులే సేవలందిస్తారు. కేవలం ఆధార్‌ లేదా ఆభా కార్డుతో ఈ సేవలు పొందవచ్చు. ఇవి పూర్తిగా ఉచితం. – డాక్టర్‌ విష్ణుమొలకల అరుణ,

నోడల్‌ అధికారి, ఎస్‌ఎన్‌ఎస్‌పిఏ, కాకినాడ జిల్లా

సద్వినియోగం చేసుకోవాలి

వయసు సహా ఇతర నిబంధనలు ఏవీ లేవు. ప్రతి మహిళ ఉచిత ఆరోగ్య పరీక్షలకు అర్హురాలే. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న ప్రతి వెల్‌నెస్‌ సెంటర్‌తో పాటు స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలన్నింటిలో ఈ పరీక్షలు చేస్తారు. అలాగే మహిళలు, బాలల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు అవగాహన కల్పిస్తారు. పరీక్షల్లో అనారోగ్యం నిర్థారణ అయితే తక్షణమే వైద్య నిపుణుల చికిత్స అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే కాకినాడ జీజీహెచ్‌కు సిఫార్సు చేస్తారు. మరిన్ని వివరాల కోసం ఆశా కార్యకర్తలు లేదా అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించండి. మహిళలు, బాలల ఆరోగ్యంతో పాటు మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా నారీ సశక్త్‌ కుటుంబ అభియాన్‌ సేవలు అందిస్తున్నాం. మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుందన్నదే ఎస్‌ఎన్‌ఎస్‌పీఏ లక్ష్యం. సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లో ప్రారంభిస్తారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

– డాక్టర్‌ నరసింహ నాయక్‌, డీఎంహెచ్‌వో,

కాకినాడ జిల్లా

16 రోజుల పాటు నిర్వహణ

కాకినాడ జిల్లాలో సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అక్టోబర్‌ రెండో తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు స్వస్థ నారీ సశక్త్‌ కుటుంబ అభియాన్‌ నిర్వహిస్తారు. ఆరోగ్య శ్రీ ఎంపానెల్డ్‌ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, గైనకాలజీ నిపుణుల సంఘటిత వేదిక ఫాగ్‌ సీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ పర్యవేక్షణలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎన్‌సీడీ–ఆర్‌బీఎస్‌కే కాకినాడ జిల్లా కార్యక్రమ అధికారి డాక్టర్‌ విష్ణుమొలకల అరుణ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.

ఆమెకు అభయం..1
1/3

ఆమెకు అభయం..

ఆమెకు అభయం..2
2/3

ఆమెకు అభయం..

ఆమెకు అభయం..3
3/3

ఆమెకు అభయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement