
తలుపులమ్మతల్లి ఆదాయం రూ.6.14 లక్షలు
తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే తలుపులమ్మతల్లి దర్శనానికి వచ్చిన భక్తులతో లోవ జనసంద్రమైంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు లోవ దేవస్థానానికి చేరుకున్నారు. క్యూలైన్లు ద్వారా 16 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,11,095, పూజా టికెట్లకు రూ.2,35,580, కేశఖండనశాలకు రూ.16,160, వాహన పూజలకు రూ.8180, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.95,792, విరాళాలు రూ.46,440 వెరసి మొత్తం రూ.6,14,247 ఆదాయం లభించినట్టు ఆయన వివరించారు.
ఆరు కొత్త ఫైర్‌స్టేషన్లకు ప్రతిపాదనలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జోన్–2 పరిధిలో ఇప్పటివరకు 50 ఫైర్‌స్టేషన్లు, 2 ఔట్ పోస్టులున్నాయని, వీటితో పాటు కొత్తగా 6 ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపామని అగ్నిమాపకశాఖ డీజీ పి.వెంకటరమణ తెలిపారు. జోన్ రివ్యూ మీటింగ్ సందర్భంగా ఆయన ఆదివారం రాజమహేంద్రవరం వచ్చారు. విలేకరుల సమావేశంలో డీజీ మాట్లాడుతూ జోన్–2లో ఫైనాన్స్ కమిషన్ ద్వారా రెండు ఫైర్‌స్టేషన్లు మంజూరయ్యాయన్నారు. మినీ రెస్క్యూ టెండర్లు, అడ్వానన్స్ వాటర్ టెండర్లు 50, 20 వాటర్ బ్రౌజర్లు, 40 కాన్వాయ్ వెహికల్స్, 46 ఇతర ఫైర్ వాహనాలు, మొత్తం161 వాహనాలకు టెండర్స్ పిలిచామన్నారు. త్వరలోనే వెహికల్స్ అన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరేళ్లనుంచి అసంపూర్ణంగా నిలిచిపోయిన 36 అగ్నిపక కేంద్రాల నూతన భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ పనులన్నీ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. జోన్–2లోని 7 జిల్లాల పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,498 అగ్నిమాపక సంఘటనలు జరిగాయన్నారు. వీటిలో రూ.108 కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కాపాడామని, అలాగే 51 మంది ప్రాణాలు రక్షించామన్నారు. అగ్నిమాపకశాఖ జారీ చేస్తున్న ఎన్‌ఓసీలకు సంబంధించి 2021, 2023 మధ్య జారీ చేసిన ఫైర్ ఎన్‌వోసీలు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999 నేషనల్ బిల్డింగ్ యాక్ట్ (ఎన్‌బీసీ) నిబంధనల ప్రకారం లేవని, మార్గదర్శకాలు పాటించలేదని గత ప్రభుత్వం ఐఏఎస్‌లతో హైపవర్ కమిటీ వేసిందన్నారు. దీనిపై మరింత సమాచారానికి 9441236448, కనెక్ట్ డీజీ ఫైర్ అనే మెయిల్‌లో సంప్రదించాలన్నారు. అనంతరం కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల అగ్ని మాపక శాఖ పనితీరును సమీక్షించారు. జోన్–2లో గత సంవత్సరకాలంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలు, విపత్తు సంఘటనలు, జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న అగ్నిమాపక కేంద్రాలు, కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, పాత, కొత్త అగ్నిమాపక కేంద్రాలకు నూతన భవన నిర్మాణాలు, సిబ్బంది లభ్యత, ఖాళీలు వంటి విషయాలను చర్చించారు. కార్యక్రమంలో నార్త్ అడిషనల్ డైరక్టర్ జి.శ్రీనువాసులు, జోన్ 2 రీజినల్ ఫైర్ ఆఫీసర్ ఈ.స్వామి, జిల్లా ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూధర్‌కింగ్, ఫైర్ ఆపీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.