
సాగర తీరాన వైజ్ఞానిక వీచిక
● పర్యాటకులను ఆకట్టుకున్న బీచ్ పార్కు
● ఆకట్టుకున్న యుద్ధ విమాన
మ్యూజియం
● తొలిరోజు సుమారు 520 మంది
సందర్శన
కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట బీచ్ వైజ్ఞానిక ప్రదర్శనకు వేదికై ంది. సాగరతీరానికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు విజ్ఞానం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఏర్పాటైన బీచ్ పార్కుకు ఆదివారం నుంచి సందర్శకుల కళ వచ్చింది. గుడా నిధులతో అప్పట్లో బీచ్ పార్క్ అభివృద్ధి చేయడంతో పాటు యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు చేశారు. సుమారు రూ.9 కోట్ల నిధులతో దీనిని అభివృద్ధి చేయగా వీటిలో రూ.5.89 కోట్లతో భారత నేవీలో సేవలందించిన టీయూ – 142 ఎం యుద్ధ విమానంతో పాటు మరో శిక్షణ విమానం ఏర్పాటు చేశారు. భారత నౌకదళం నావికా విభాగంలో 28 ఏళ్ల పాటు సేవలందించి 2017లో వైదొలిగిన భారీ యుద్ధ విమానాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయడంతో సందర్శకులకు మంచి అనుభూతిని అందివ్వనుంది. 2024 ఎన్నికల ముందు యుద్ధ విమాన మ్యూజియంను అప్పటి మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎంపీ వంగా గీత, కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ప్రారంభించారు. అనంతరం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో సందర్శకులకు ప్రవేశం లేకుండా పోయింది. తాజాగా ఆదివారం ఉదయం నుంచి సందర్శకులకు కౌడా అధికారులు అనుమతి ఇచ్చారు. యుద్ధ విమానం మ్యూజియంను చూసేందుకు పెద్ద వారికి రూ.40, పిల్లలకు రూ.20 టిక్కెట్ నిర్ణయించి ప్రవేశం కల్పించడంతో తొలిరోజే సుమారు 500 మందికి పైగా సందర్శకులు మ్యూజియం సందర్శించారు. యుద్ధ విమానం నేవీలో అందించిన సేవల గురించి వీడియో రూపంలో వుడెడ్ హౌస్‌లో 10 నిముషాలు నిడివిగల చిత్రం ద్వారా అవగాహన కల్పించారు. కౌడా వీసీ రాహుల్ మీనా సూచనల మేరకు సందర్శకులకు అనుమతి ఇచ్చామని కార్యదర్శి కాళీబాబు, డీఈ రామారావు తెలియజేశారు.

సాగర తీరాన వైజ్ఞానిక వీచిక