నీటి వనరులను పొదుపుగా వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

నీటి వనరులను పొదుపుగా వినియోగించాలి

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

గద్వాల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు. సోమవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు వీసీ నిర్వహించగా.. జిల్లాలోని అన్ని రైతువేదికల్లో రైతులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రబీ సీజన్‌లో రైతులు వరిపంటను సాగుచేయరాదని, బిందుసేద్యంతో తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలు సాగుచేయవచ్చన్నారు. జలసిరి కార్యక్రమంలో ఇంకుడు గుంతలు, నీటికుంటలు, బోర్‌వెల్స్‌ జలవనరులను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందని, త్వరలోనే కరువు మండలాలు గుర్తించి ప్రకటిస్తుందన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు ఉత్పన్నమవకుండా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. విద్యుత్‌ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలశాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్‌ లెవెల్‌ నివేదికలను అందజేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందుకనుగుణంగా అధికారులంతా పనిచేయాల్సి చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్‌ జిల్లాలోని శాఖల అధికారులు, రైతులతో వీసీలో మాట్లాడారు. ఆరుతడి పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైతులు నష్టపోకుండా ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇరిగేషన్‌ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ అధికారి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement