ఇకపై వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే కఠిన చర్యలు
గద్వాల క్రైం: ఇన్సూరెన్స్ లేకుండా రయ్.. రయ్‌మంటూ రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై ఇక కఠిన చర్యలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని పోలీసు, రవాణాశాఖ వాహనాలపై నిఘా పెంచారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడంలో కీలకమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహన యజమానులు ఇక అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా జేబు చమురు వదిలించకోవడమో.. లేకపోతే కటకటాల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.
వాహనానికి బీమా ఉండటంతో ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి, ఎదుటివారి కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు వాహనదారులకు వివరిస్తున్నారు. అయితే వాహనదారులు మాత్రం బీమా రెన్యూవల్‌పై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గడువు ముగియక ముందే తప్పనిసరిగా రెన్యూవల్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
●
నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్
ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకే పెట్రోల్, డీజిల్ విక్రయించేలా ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించాయి. పెట్రోల్ బంకులను ఆర్టీఏ వాహన్ పోర్టల్‌తో అనుసంధానించడం, నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరాలు లేదా ఆన్‌లైన్ స్కానింగ్ యంత్రాలను బంకుల్లో ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు, రద్దీ సమయాల్లో బంకుల వద్ద వాహనాల బారులు వంటి సమస్యలు తతెత్తే అవకాశం ఉందని బంకు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఎలాంటి చర్యలు లేకపోవడం కొసమెరుపు.
ఒకటి.. రెండోసారి
ఎవరైనా వాహనం ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2 వేల వరకు జరిమానా.. రెండోసారి పట్టుబడితే రూ.4 వేలు జరిమానా లేదా 3 నెలల జైలుశిక్ష లేదా రెండూ విధించవచ్చు. ఇన్సూరెన్స్ లేని వాహనం ప్రమాదానికి గురై ఎవరైనా మరణించినా లేదా గాయపడినా నిందితులకు కోర్టులు విధించే రూ.లక్షల పరిహారాన్ని యజమానే స్వయంగా చెలించాల్సి ఉంటుంది. లేకుంటే ఆస్తులు జప్తు చేసే అధికారం చట్టానికి ఉంటుంది. బీమా పత్రాలు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రవాణాశాఖకు ఉంది.
ఆర్థికంగా ప్రయోజనం..
భారీ జరిమానా లేదా జైలుశిక్ష విధించే అవకాశం
తాజాగా ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు
బంకుల్లోనూనో ఫ్యూయల్‌కు రవాణా శాఖ
అధికారుల చర్యలు
తనిఖీలు ముమ్మరం చేసిన పోలీస్ శాఖ


