ధరూరు: విద్యా రంగంలో విశేష సేవలందించిన ఉపాధ్యాయురాలికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జాంపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేవతి విద్యాభివృద్ధికి తనవంతుగా ఎంతో సేవ చేస్తున్నారు. కృషి, అంకితభావం, విద్యార్థుల భవిష్యత్ కోసం అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ హయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం చేతులమీదుగా ఆదివారం హైదరాబాద్‌లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఎంఈఓ రవీంద్రబాబు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.
సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం
గద్వాల న్యూటౌన్: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులందరం ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సంఘాల నాయకులు సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. జేఏసీ నిర్వహించే కార్యక్రమాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోచైర్మన్ హన్మంతరావు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


