అయిజ: ఉప సర్పంచ్ చెక్ పవర్ తొలగించే ఆర్డర్‌ను హైకోర్టు రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం అయిజలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజోళి మండలంలోని మాన్‌దొడ్డిలో ఉపసర్పంచ్ భీమన్న చెక్ పవర్‌ను కలెక్టర్ ఎలాంటి విచారణ చేయకుండా ఇటీవల రద్దు చేశారని ఆరోపించారు. ఉప సర్పంచ్ గ్రామాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ.. బీజేపీకి చెందిన నాయకుడు కావడంతో కక్ష సాధింపు చర్యగా ఉపసర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎలాంటి చర్చ పెట్టకుండా అడ్డదారిన తెచ్చిన జీఓ రాష్ట్రంలోని ఉపసర్పంచ్‌లను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రానివారిపై ఇలాంటి చర్యలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. నిజాయితీగా పనిచేసే ఉపసర్పంచ్‌లందరికి బీజేపీ అండగా ఉంటుందని, ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో మాన్‌దొడ్డి ఉపసర్పంచ్ భీమన్న, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, రాజోళి మండల ఎస్సీ మోర్చ అధ్యక్షుడు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.


