150 మంది ఆత్మీయులతో భేటీ..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్‌రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది.
జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రయాణంలో మిడ్జిల్ ప్రజల ఆశీర్వాదం కీలకమని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ‘పాలమూరులోని నల్లమలలో పుట్టిన ఈ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిని అయ్యానంటే మీ ఆశీర్వాద ఫలితమే. మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం దక్కింది. ఈ నేల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అంటూ ఉమ్మడి పాలమూరులో పలుమార్లు పర్యటించిన సందర్భంగా ఆయన వెల్లడించారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడిన మిడ్జిల్‌లో జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న సమయంలో తనతో కలిసి తిరిగిన ఆనాటి పెద్దలు, నాయకులు, అనుచరులతో ఊర్కొండ ఆలయ ఆవరణలో మమేకం కానున్నారు. ఈ మేరకు మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లోని 150 మందికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఒక్కో టేబుల్ దగ్గర ఐదుగురు కుర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం ఒక్కో టేబుల్ వద్దకు వెళ్లి వారిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకోనున్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మండలానికి వస్తుండడంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రంలోని కాలనీలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తండాలు, గ్రామాలకు బీటీ రోడ్లతో పాటు ఊర్కొండ ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.
నేడు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని
పురస్కరించుకుని పర్యటన
ఊర్కొండలోని హనుమాన్
ఆలయంలో పూజలు
ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ


