వేతనాల సంబురం | - | Sakshi
Sakshi News home page

వేతనాల సంబురం

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

శుక్రవారమే ఖాతాలో జమ..

ఎట్టకేలకు పీయూ నాన్‌టీచింగ్‌ సిబ్బందికి జీతాల పెంపు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్‌లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్‌ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్‌టీచింగ్‌ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్‌సోర్సింగ్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్‌ఎంఎఫ్‌ పోర్టల్‌లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు.

పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్‌ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్‌ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది.

ఈ నెల నుంచే ఔట్‌ సోర్సింగ్‌

ఏజెన్సీలకు అప్పగింత

2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి

పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement