కేటీదొడ్డి/ ఎర్రవల్లి/ అలంపూర్ రూరల్: రైతాంగానికి అవసరమైన అన్ని రకాల సేవలు, సదుపాయాలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సేవా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని కోండాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు సాగుకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ అందుబాటులో ఉండే హాకా రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటరాములు, జిల్లా కోశాధికారి రామచంద్రరెడ్డి, కిసార్ మోర్చా అద్యక్షుడు కిష్టన్న, మండలాధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, హన్మిరెడ్డి, భీంరెడ్డి, వీరేష్, సూర్యకాంత్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఎంపీ డీకే అరుణ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆమెకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధికారులు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనం పలికారు. అలాగే జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎంపీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శక్తి స్వరూపిణి జోగుళాంబతల్లి దీవెనలు దేశ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.


