ధరూరు: గ్రామీణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని లక్ష్మీనాగరాజు నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన సర్పంచు విజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ అనేవి కీలకమైనవన్నారు. దశాబ్దాల తరబడి సొంతిళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో శుభ పరిణామమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పటికే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో జాబితా వస్తుందని, ఇందులో ఇళ్లు వచ్చిన వారు కూడా ఇల్లు త్వరగా నిర్మించుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, సర్పంచు విజయ్‌కుమార్, మాజీ సర్పంచు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సంజీవ్, రవి తదితరులు పాల్గొన్నారు.


