అయిజ: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నలను ప్రభుత్వం సకాలంలో కొనడం లేదని, కాంటా వేసిన బస్తాలను గోదాంలకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని శనివారం మండల కేంద్రంలోని గద్వాల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మల్లేష్ సంఘటనా స్థలానికి పోలీస్ బృందంతో చేరుకున్నారు. రోడ్డుపై నుంచి రైతులు వెళ్లిపోవాలని కోరినా వినిపించుకోలేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంకు రైతులు మొక్కజొన్నను తరలించినప్పటి నుంచి బస్తాలను గోదాంకు తరలించే వరకు సుమారు నెల రోజులు పడుతుందని, రైతులు అంతవరకు కాపలా కాయాల్సి వస్తుందని మండిపడ్డారు. ఒక్కరోజులోనే రైతుల మొక్కజొన్న బస్తాలను మొత్తం గోదాంకు తరలించేలా ఏర్పాటు చేస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు.


