గద్వాల: ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పథకాలు తోడ్పాటు అందిస్తాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నానో సాంకేతికత ఆధారిత ఎరువుల వినియోగం ద్వారా తక్కువ వ్యయంతో అధిక ప్రయోజనాలు పొందుతూ, భూ సారాన్ని కాపాడడం ద్వారా పంటల దిగుబడులు పెంచుకోవచ్చన్నారు. ఆహార ప్రాసెసింగ్ యూని ట్లు ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం ద్వారా 35శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు.
3 శాతం వడ్డీతో..
వ్యవసాయ మౌలిక సదపాయాల నిధి పథకం కింద రూ.2కోట్ల వరకు 3శాతం వడ్డీతో కూడిన సబ్సిడీని పొందవచ్చని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకం అమలు చేస్తున్నామని, గొర్రెలు, మేకల యూనిట్లు పెట్టుకొనేందుకు ప్రభుత్వం నుంచి 50 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా ఎకరాకు రూ.50 వేల వరకు రుణం, పీఎంఈవై స్వయం ఉపాధి అవకాశాలకు 25 నుంచి 35 శాతంతో కూడిన సబ్సిడీలు లభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యానవన దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో అధికారులు సక్రియానాయక్, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, రామలక్ష్మి, అక్బర్, మనోహర్‌రెడ్డి, వెంకటేశ్వ ర్లు, షకీలాభాను, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్