
భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: పెండింగ్‌లో ఉన్న భూ భారతి ధరఖాస్తులు త్వరగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో భూ బారతి, రేషన్ కార్డుల ధ్రువీకరణ, మీ–సేవ దరఖాస్తులు ఎఫ్–లైన్ పిటిషన్లపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి ద్వారా భూమి వివాదాలు తగ్గి రైతులకు, భూ యాజయానులకు శాశ్వత న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని దరఖాస్తులపై తదుపరి చర్యలకు ముందు త్వరగతిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అసైన్‌మెంట్ భూముల సమస్యలను పూర్తిగా పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా పౌరసరఫరా అధికారి స్వామి ఉన్నారు.
మానిటరింగ్ సభ్యులతో సమావేశం
జిల్లా అభివృద్ధికి సంబంధించి జాతీయ స్థాయి మానిటరింగ్ సభ్యులు చేసిన సూచనలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నందు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ తరపున జిల్లాలో పర్యటించిన సభ్యులు సివి బాలమురళి, ఆర్ రాధిక కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా గ్రామీణభివృద్ధిలో వేగంగా పురోగమిస్తుందని అభిప్రాయపడ్డారు. వారు ఇటీవల పలు గ్రామాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ మిషన్, పక్కా ఇళ్ల నిర్మాణం, నీటి వసతి, మౌలిక వసతులు తదితర వాటిపై సంతృప్తి వ్యక్తం చేశారు.