కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’ | - | Sakshi
Sakshi News home page

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

Jul 14 2025 5:19 AM | Updated on Jul 14 2025 5:19 AM

కాలుష

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ., మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి జీవరాశులు, వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది. ఇంతటి ప్రాముఖ్యత గల కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. ఎగువనున్న కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యపు నీటిని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా కృష్ణాజలాలు పచ్చరంగులోకి మారుతూ విషపూరితమవుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లో లేకపోగా.. ఇతరత్రా అధికార యంత్రాంగం తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకొంటోంది.

కొల్లాపూర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది దిగువకు ప్రవహిస్తుంటుంది. అయితే కృష్ణానది తీరం వెంట పలు రసాయన, ఔషధ, ఆల్కహాల్‌ పరిశ్రమలు నెలకొల్పారు. వాటి వ్యర్థాలను నది తీరంలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. అలాగే నది తీర గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని కూడా తీరం ఒడ్డునే పారబోస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వరద జలాలు వదిలిపెట్టినప్పుడు కలుషితాలన్నీ నీటిలో కలిసి దిగువకు ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ వంటి నదుల నుంచి కూడా కాలుష్య కారకాలు వచ్చి కృష్ణానదిలో కలుస్తున్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గ సరిహద్దులోనే ఆయా నదులు సంగమం అవుతుంటాయి. కాలుష్య కారకాల వల్ల జటప్రోల్‌, మంచాలకట్ట, మల్లేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో నది నీళ్లు పచ్చగా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ఇలా నీటిపై పచ్చని రంగులో తెట్టెలు దర్శనమిస్తున్నాయి. నీటిమట్టం తగ్గేకొద్దీ కలుషిత నీరు అంతా దిగువకు ప్రవహిస్తూ పోతుంది.

కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి జిల్లాలకు కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్‌ భగీరథ స్కీం నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కృష్ణానది నీటినే వినియోగిస్తున్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కృష్ణానీటిని ఫిల్టర్‌ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్య కాటుకు గురవుతున్న నీటిని సక్రమంగా శుద్ధి చేయకుంటే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యసంపద వృద్ధికి ఇబ్బందికరంగా నీటి కాలుష్యం మారకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మత్స్య సంపదకూ ముప్పే..

నీటి కాలుష్యంతోపాటు గుర్రపు డెక్క కూడా కృష్ణానదిలో విస్తరిస్తోంది. ఎగువ నుంచి కిందకి నీళ్లు వచ్చినప్పుడు తీరప్రాంతాల్లోని చెత్తాచెదారంతోపాటు గుర్రపు డెక్క కూడా వస్తోంది. ఇది శ్రీశైలం డ్యాం వరకు నిదానంగా చేరుతోంది. కాలుష్యం, గుర్రపుడెక్క కారణంగా నదిలోని మత్స్య సంపదకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అలివి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదు. కాలుష్యం కూడా దీనికి తోడైతే మత్స్యకారుల జీవనోపాధికి ఇక్కట్లు తప్పవు.

కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు

పలు ప్రాంతాల్లో ఆకుపచ్చ రంగులోకి నది నీళ్లు

మూడేళ్లుగా అధికమవుతున్న నీటి కాలుష్యం

వరదలతో దిగువకు పారుతున్న కలుషిత జలాలు

దరిదాపుల్లో కానరాని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’1
1/2

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’2
2/2

కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement