
అట్టహాసంగా ముగిసిన కబడ్డీ పోటీలు
గద్వాలటౌన్: గద్వాల ఆతిథ్యంతో స్థానిక ఎస్‌ఆర్ విద్యానికేతన్ వేదికగా గత మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి రాష్ట్రాల క్లస్టర్ సీబీఎస్‌ఈ పాఠశాలల అండర్ –14, 17, 19 బాలికల కబడ్డీ పోటీలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. అండర్–14 విజేతగా హైదరాబాద్‌కు మాతృశ్రీ విద్యానికేతన్ జట్టు, రన్నర్‌గా గద్వాలకు చెందిన ఎస్‌ఆర్ విద్యానికేతన్ జట్లు నిలిచాయి. అండర్–17 విజేతగా తిరుపతికు చెందిన వెరిటాస్ సైనిక్ స్కూల్ జట్టు, రన్నర్‌గా హైదరాబాద్ శాంతినికేతన్ జట్టు నిలిచాయి. అండర్–19 విజేతగా హైదరాబాద్ ఓబుల్‌రెడ్డి జట్టు, రన్నర్‌గా తూర్పు గోదావరికి చెందిన సిస్టర్ నివేధిత జట్టు నిలిచింది. ఇరుజట్ల క్రీడాకారులు ఒక వైపు క్రీడాస్పూర్తిని కనబరుస్తూనే మరోవైపు క్రీడాకారులు గెలుపునకు చివరిదాకా కృషి చేశారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
ప్రతి క్రీడాకారుడికి క్రీడా స్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని డీఎస్పీ మొగలయ్య అన్నారు. శనివారం సాయంత్రం జరిగిన పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల పట్టణంగా గద్వాల అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడలు జీవితానికి గొప్ప స్పూర్తినిస్తాయని, అందువల్ల వాటిని తప్పని సరిగా ప్రోత్సహించాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు మెమోంటోలు, మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, పాఠశాల డైరెక్టర్ రాముడు, ప్రిన్సిపల్ సునిత గోన తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్ యూనివర్సిటీ సేవా విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి అపోలో, కిమ్స్, డెక్కన్ మెడికల్ కళాశాల తదితర వాటిలో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉందన్నారు. వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
నేడు రాష్ట్రస్థాయి
నెట్‌బాల్ సెలక్షన్స్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి నెట్‌బాల్ సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమ్ ఆదిత్యరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న జాతీయస్థాయి నెట్‌బాల్ టోర్నమెంట్‌లకు సంబంధించి రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం నమక్కల్‌లో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే 17వ సౌత్‌జోన్ నేషనల్ నెట్‌బాల్, ఇదే వేదికలో 18, 19 తేదీల్లో జరిగే 2వ ఫాస్ట్5 సౌత్‌జోన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్, 19, 20 తేదీల్లో జరిగే మొదటి సౌత్‌జోన్ నేషనల్ మిక్స్‌డ్ పోటీలు, హర్యానా రాష్ట్రం పల్వాల్‌లో వచ్చే నెల 28 నుంచి 31 వరకు నెట్‌బాల్ పురుష, మహిళా జట్ల సెలక్షన్స్ ట్రయల్స్ ఉంటాయన్నారు. సెల్ .8883800699ను సంప్రదించాలని కోరారు.