
పక్కా ఫోర్జరీనే..
●
● పచ్చర్లలో నకిలీ ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌పై క్షేత్రస్థాయి విచారణ
● పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు తేల్చిన అధికారులు
● ఎస్పీ కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు
కలెక్టర్‌కు నివేదిస్తాం..
పచ్చర్ల గ్రామపంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీకి సంబంధించి ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ విచారణ అధికారి. ఆయన ఇచ్చిన నివేదికలో ఫోర్జరీ జరిగినట్లు స్పష్టం చేశారు. విచారణ సమయంలో సదరు పంచా యతీ కార్యదర్శిని సైతం విచారించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పించి.. తదుపరి చర్యలు చేపడతాం.
– నాగేంద్రం, ఏడీపీఓ
రాజోళి: మండలంలోని పచ్చర్ల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ ఇంటిని మరొకరికి విక్రయించిన వైనం నిజమని తేలింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఎంపీడీఓ ఖాజామొయినుద్దీన్ నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా అది పక్కా ఫోర్జరీ అని అధికారులు తేల్చేశారు. పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తమ ఇంటిని ఇతరులకు విక్రయించినట్లు తేలడంతో బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన తామేశ్‌గౌడ్‌కు వారసత్వ ఆస్తిగా ఇంటిని ఇస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. అయితే జీవనోపాధి నిమిత్తం ఆయన తన కుటుంబంతో కలిసి ఇటిక్యాల మండలం ధర్మవరంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు దక్కాల్సిన ఇంటిని తన సోదరుడు కుటుంబ సభ్యులతో కలిసి 2025 జనవరి 1న ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు గాను గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి తీసుకోవాల్సిన ధ్రువపత్రాల కోసం ఫోర్జరీ సంతకాలకు తెరలేపారు. అందులో భాగంగా 2021లో తమ పేరుపై గ్రామపంచాయతీ కార్యదర్శి ఓనర్‌షిప్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సృష్టించి.. రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకోసం అవసరమైన సాక్షులను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లినప్పటికీ.. వారికి విషయం తెలుసుకుండా రిజిస్ట్రేషన్ తతంగం ముగించేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు ఫోర్జరీ సంతకాలతో తన ఇంటిని అమ్ముకున్నారని తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ‘సాక్షి’ ద్వారా విషయాన్ని బయటకు తీసుకొచ్చారు.
‘సాక్షి’ వరుస కథనాలతో కదలిక..
పంచాయతీ కార్యదర్శి ఫోర్జరీ సంతకంపై గత నెల 24న ‘ఫోర్జరీ పెట్టు.. ఆస్తి కొట్టు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అయితే జిల్లాలో ఫోర్జరీ సంతకాలతో మోసపోయిన మరికొందరు బాధితులు ‘సాక్షి’ని సంప్రదించడంతో పాటు ఫోర్జరీలకు సంబంధించిన ఆధారాలను సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో గతనెల 27న ‘చర్యలు తీసుకోరా?’ శీర్షికతో మరో కథనం ప్రచురితం కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. పచ్చర్లలో తప్పుడు ధ్రువపత్రం మంజూరైన సమయంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి ధనుంజయరెడ్డిని సైతం విచారించారు. ఆ సమయంలో తాను ఎలాంటి ఓనర్‌షిప్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని.. అందులో ఉన్న సంతకం కూడా తనది కాదని నిర్ధారిస్తూ నివేదిక అందించారు. దీంతో తమ విచారణలో అది తప్పుడు ధ్రువపత్రం అని తేలిందని మండలస్థాయి అధికారులు జిల్లా అధికారులకు నివేదిక సమర్పించారు.

పక్కా ఫోర్జరీనే..