
పేరుకుపోయిన బకాయిలు
గద్వాలటౌన్: గద్వాల మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే మనరులుగా రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వ్యాపార సముదాయాలు పరుల పాలవుతున్నాయి. దుకాణాలను పొందిన వ్యక్తులు వాటిని ఇతరులకు అద్దెకించి డబ్బులు వెనకేసుకుంటుండగా.. మున్సిపాలిటీకి మాత్రం అద్దె చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సముదాయాల్లో నిబంధన ఉల్లంఘన అడుగడుగునా చోటుచేసుకుంటున్నా అద్దె వసూలు చేయాలనే సాహసం ఒక్క అధికారి చేయకపోవడం గమనార్హం. రాజకీయ జోక్యంతో సొంత ఆస్తులపై రాబడిని ఆర్జించలేని స్థితి మున్సిపాలిటీలో నెలకొంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో గద్వాలతో పాటు అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాల క్రితం ఐడీఎస్‌ఎంటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రుణంతో గద్వాల మున్సిపల్ పరిధిలో 236 దుకాణాలను చేపట్టారు. ఏ నుంచి హెచ్ బ్లాక్ వరకూ.. స్టోర్స్ అకాడమీ, నల్లకుంట కాలనీ, కూరగాయల మార్కెట్ దగ్గర, పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం పక్కన, కళాశాల మార్గంలో ఉన్న ప్రధాన రహదారుల పక్కన దుకాణాలను నిర్మించారు. కొన్ని దుకాణ సముదాయాలకు 30 ఏళ్లు లీజు అగ్రిమెంట్ పూర్తయింది. కేటాయించిన దుకాణాల అద్దెలను ప్రతి మూడేళ్లకు రెన్యూవల్ చేయాలి. కానీ అద్దెలను మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు పెంచకుండా తక్కువ మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో దుకాణాల అద్దె బకాయి రూ.95 లక్షలకు చేరుకుంది.
బకాయిలు వసూలు చేస్తాం
మున్సిపాలిటీకి సంబంధించిన దుకాణాల అద్దె బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. ఇప్పటికే బకాయిలు ఎక్కువగా ఉన్న దుకాణాలకు సంబంధించి జాబితా తయారు చేశాం. వారందరికి నోటీసులు జారీ చేస్తున్నాం. అప్పటికీ స్పందించకుంటే దుకాణాలకు తాళాలు వేస్తాం. దుకాణా ల అద్దె విషయంలో కఠిన చర్యలు తప్పవు.
– దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల
వ్యాపార సముదాయాలపై కొరవడిన పర్యవేక్షణ
రూ.95 లక్షల అద్దె బకాయిలు
మున్సిపల్ ఆదాయానికి గండి

పేరుకుపోయిన బకాయిలు