
వంద పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తాం
అలంపూర్: ప్రజారోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని.. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు అత్యాధునిక పరికరాలు ఏర్పాటుచేసి త్వరలో అందుబాటులోకి తెస్తామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్య బృందంతో ఆస్పత్రిలోని ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, సమావేశ, ఇతర గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల యోగక్షేమాల నిమిత్తం 2018లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయించానని అన్నారు. కానీ పనులు నత్తనడకన సాగిస్తూ ఈ ప్రాంత ప్రజల యోగక్షేమాలకు కాకుండా.. ఓట్లు సీట్ల కోసం గత ప్రభుత్వం వైద్యులు, పరికరాలు లేకుండానే ప్రారంభం చేసిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించడంతోపాటు పరికరాలు ఏర్పాటుచేయనున్నట్లు, ఇందుకు జిల్లా వైద్య బృందం సహకరించడం సంతోషమన్నారు. పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామని సంపత్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ సయ్యద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్, జిల్లా వైద్యులు అమీర్, దివ్యతోపాటు నాయకులు గోపాల్, రాములు, రవి, ఆలయ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.