
రేపు ఉద్యోగ మేళా
గద్వాల: జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న ఐడీఓసీలోని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి ప్రియాంక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, కర్నూలు, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోని కంపెనీల్లో శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18–35 ఏళ్ల వయసు ఉండి, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ఏదైనా డిగ్రీ, ఎంబీఓ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. ఐడీఓసీలోని ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో నిర్వహించే ఉద్యోగ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: జిల్లాలోని దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం ద్వారా 2025–26 సంవత్సరం అందించే సబ్సిడీ రుణాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడబ్ల్యూ ఓ సునంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి, చేతివృత్తుల, కుటీర పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు గాను మండలానికి ,మున్సిపాలిటీకి ఒకటి చొప్పున రూ. 50వేల నాన్ బ్యాంక్ లింకేజీతో, జిల్లాకు ఒక లింకేజీ యూనిట్ కోసం ఈ నెల 31వ తేదీలోగా https.tgobmms. cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సర్టిఫికెట్ల పరిశీలన..
జిల్లాలో దివ్యాంగుల ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సదరం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని డీడబ్ల్యూఓ తెలిపారు. ఐడీఓసీ భవనంలో ఈ నెల 15, 16 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ఆప్లికేషన్ ఫాంతో పాటు సదరం ఒరిజినల్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, కులం, ఆదాయం ధ్రువపత్రం ఒక సెట్ జిరాక్స్‌తో హాజరు కావాలని సూచించారు. 15న బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికిల్, 16న మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్ ఇతర ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు హాజరు కావాలని సూచించారు.
డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న సెమిస్టర్– 2, 4, 6కు సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి సెమిస్టర్–2 బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86, బీఎస్సీ 29.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెమిస్టర్–4 బీఏలో 51.36, బీకాంలో 43.57, బీఎస్సీలో 37.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్–6 బీఏలో 52.27, బీకాం 54.57, బీఎస్సీ 55.58 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బ్యాక్‌లాగ్ సెమిస్టర్–5 బీఏలో 52.88 శాతం, బీకాంలో 54.44, బీఎస్సీలో 46.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, శాంతిప్రియ, అనురాధరెడ్డి, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.