
స్వాతంత్రోద్యమంలో మైనార్టీల పాత్ర మరవలేనిది
గద్వాలటౌన్: దేశ స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముస్లిం మైనార్టీల పాత్ర మరవలేనిదని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆవాజ్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా రెండో రోజు సోమవారం ‘భారత స్వాతంత్య్ర ఉద్యమం– మైనార్టీల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముస్లిం మైనార్టీలు ఎంతో మంది బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చారిత్రక పోరాటాలకు మతంరంగు పులిమితే దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ ఆర్థిక రాజకీయ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలు జాగృతమై సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అతికూర్ రెహమాన్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వామి, ఆంజనేయులు, ఇక్బాల్‌పాషా, పల్లయ్య, జలీల్, తాహేర్, రంగు మద్దిలేటి, ఆంజనేయులు, సునందం, వీవీ నర్సింహ, రహీమతుల్లా, ఉప్పేర్ నర్సింహ పాల్గొన్నారు.