
రైతులకు అన్యాయం చేస్తే సహించం
గద్వాల: సీడుపత్తి సాగుచేస్తున్న రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని ప్రతిపక్షపార్టీ బీజేపీ, బీఆర్‌ఎస్, నడిగడ్డహక్కుల పోరాటసమితి, తెలంగాణ రైతుసంఘం పార్టీలకు చెందిన నాయకులు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట సీడు పత్తిరైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఏడాది కంపెనీలు ఇచ్చిన విత్తనాలతో పంట సాగు చేశారని, రెండు నెలల తర్వాత ఒక్కోరైతు నుంచి కేవలం 2 క్వింటాళ్ల పత్తి విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీడ్ కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయారని, రైతులు పండించిన పూర్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ హామీతో ధర్నా విరమణ
రైతుల చేపట్టిన ధర్నా వద్దకు కలెక్టర్ బీఎం సంతోష్ వచ్చి సీడుపత్తి రైతులు పండించిన పంటల దిగుబడులు మొత్తాన్ని సీడ్‌కంపెనీలు, సీడ్‌ఆర్గనైజర్లు తీసుకునేందుకు ఒప్పుకున్నారని, ఇందుకు సంబంధించి వారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు చెప్పడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో నాయకులు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, ఇక్బాల్‌పాష, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, వివి నర్సింహా, కుర్వపల్లయ్య, రంజిత్‌కుమార్, బుచ్చిబాబు,లవన్న తదితరులు పాల్గొన్నారు.