
సరిహద్దు దాటిస్తున్నారు!
కర్ణాటకలోని బ్లాక్ మార్కెట్‌కు మిల్లర్ల ధాన్యం తరలింపు
కేసు లేకుండా చేసేందుకు రూ.10 లక్షలతో భేరం
కేటీ.దొడ్డిలోని రైస్‌మిల్లు ఓనర్‌కు రాజకీయ పలుకుబడి ఉంది. సదరు మిల్లర్ ఎవరు అధికారంలో ఉంటే వారిపంచన చేరి తన అక్రమ దందాను నిరాటకంగా కొనసాగిస్తుంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే సివిల్‌సప్లై శాఖలో ఓ అధికారి ఆశ్రయం కోరాడు. మంగళవారం సదరు మిల్లు ఓనర్ కలెక్టరేట్‌లోని సివిల్‌సప్లై కార్యాయలంలో తిష్ట వేశాడు. కేసు లేకుండా, ధాన్యం లారీని వదిలిపెడితే ఏకంగా రూ.10లక్షల వరకు లంచం ఇస్తానని సదరు అధికారితో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఇదిలాఉండా, సాధారణంగా పది బస్తాల పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎవరైనా తరలిస్తూ పట్టుబడితే వెంటనే కేసు నమోదు చేస్తారు. కానీ సుమారు రూ.12లక్షల విలువ గల ధాన్యం లారీ పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే 24గంటలు దాటినా ఇంకా కేసు నమోదు కాలేదంటే సదరు మిల్లు ఓనర్ ఏ స్థాయిలో అధికారులను మ్యానేజ్ చేశారో స్పష్టమవుతుంది.
ధాన్యం లారీని వదిలేసి..
బియ్యం లారీని కర్ణాటకకు తరలించిన మిల్లు ఓనర్ కుమారుడు ధాన్యం లారీని సైతం దౌర్జన్యంగా తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు తిరగబడ్డారు. అప్పటికే అక్కడికి పోలీసులు రావడంతో చేసేది లేక ధాన్యం లోడు లారీని అక్కడే వదిలేసి వెళ్లారు.
గద్వాల: రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి.. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని మిల్లర్లకు కేటాయిస్తుండగా.. కొందరు మిల్లర్లు ఇదే అదనుగా అవినీతికి తెరలేపుతున్నారు. యథేచ్ఛగా ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు, పక్క రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున కేటి.దొడ్డిలో ప్రభుత్వం సీఎమ్మార్ నిమిత్తం మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని ఓ మిల్లర్ దొంగచాటుకు బ్లాక్ మార్కెట్‌కు తరలించే యత్నం చేసిన ఘటన నిజమనే చెబుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా.. కేటీదొడ్డి మండంలోని ఓ రైస్ మిల్లు యజమాని ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు పథకం రచించాడు. ఇందుకోసం 12 టైర్ల సామర్థ్యం ఉన్న ఓ లారీని మంగళవారం తెల్లవారుజామున మిల్లు వద్దకు రప్పించి అందులో సుమారు 400 క్వింటాళ్ల (535 బస్తాలు) ధాన్యం లోడ్ చేశారు. అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక బార్డర్ దాటించి రాయచూర్ జిల్లా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశారు. అయితే విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు నందిన్నె చెక్‌పోస్టు వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని అడ్డుకున్నారు. అయితే అదే మిల్లు నుంచి బియ్యం లోడుతో ఉన్న మరో లారీ కూడా అక్కడికి రావడం గమనించిన గ్రామస్తులు బియ్యం లారీని సైతం అడ్డుకుని నిలిపేశారు. ఈక్రమంలో మిల్లు ఓనర్ కుమారుడు దౌర్జన్యంగా లారీని స్టార్ట్ చేసి గ్రామస్తులపై ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు పక్కకు తప్పుకోగా.. అదే అదనుగా భావించి బియ్యం లోడు లారీని కర్ణాటకలోని రాయచూరుకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
పదుల సంఖ్యలో కేసులు
పేదల ఆకలి తీర్చాల్సిన పీడీఎస్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అవినీతిపరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణ ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతుంది.
ఫిర్యాదు ఇస్తే కేసు
ధాన్యం లారీ పట్టుకున్న వ్యవహారంపై కెటి.దొడ్డి ఎస్‌ఐ శ్రీనివాసులను వివరణ కోరగా.. ధాన్యం లారీని గ్రామస్తులు పట్టుకుని తమకు సమాచారం ఇస్తే వెళ్లి స్వాధీనం చేసుకున్నాం. అయితే ధాన్యం లోడుతో ఉన్న లారీ అక్రమంగా వెళ్తుందా.. అన్న విషయాన్ని సివిల్‌సప్లై శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. వారు ఫిర్యాదు ఇస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు ధాన్యం లారీపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ధాన్యం లారీని చింతలకుంట రైస్‌మిల్లులో భద్రపర్చామని ఎస్‌ఐ తెలిపారు.
తాజాగా ధాన్యం, బియ్యం లారీలు రాయచూరు తరలింపునకు యత్నం
గ్రామస్తుల పట్టివేత..
మిల్లు యజమాని కుమారుడి దౌర్జన్యంతో వెనక్కి తగ్గిన గ్రామస్తులు
రూ.12 లక్షల విలువైన ధాన్యం దొరికినా కేసు నమోదు కాని వైనం
కేసు లేకుండా చేసేందుకు సివిల్ సప్లై అధికారితో రూ.లక్షల్లో ఒప్పందం?
సమగ్ర విచారణకు ఆదేశం
కేటీదొడ్డి మండలంలో పట్టుబడిన ధాన్యం లారీ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాం. లారీలో ఉన్న ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యమా కాదా.. అన్న వివరాలు సేకరిస్తాం. అలాగే, ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం వివరాలు మిల్లులో ఉన్న స్టాక్ వివరాలు పరిశీలించి వ్యత్యాసం ఉన్నట్టు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరైన అఽధికారుల పాత్ర ఉంటే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలు తేలే వరకు ధాన్యంలారీని సీజ్ చేసి చింతలకుంటలోని రైస్‌మిల్లులో ఉంచాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్