
ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయండి
ధరూరు: రపభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరు పని చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని ఉప్పేరు గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది హాజరు, ప్రసవాలు, స్టాక్, తదితర రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగుల పూర్తి వివరాలు నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. పీహెచ్‌సీలో ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులకు సంబంధించి సాధారణ ప్రసవాలు చేయాలని, ప్రైవేట్‌తో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డెలివరీ క్యాలెండర్‌ను రూపొందించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అత్యవసర సేవలిందించేందుకు ఈ ప్రాంతానికి ఒక అంబులెన్స్‌ను త్వరలోనే కేటాయిస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్‌గా వచ్చే రోగాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలపై అవసరమైతే గ్రామాల్లో చాటింపులు చేయించాలన్నారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలని, ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగు పరచాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వర్థించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సిద్దప్ప, డాక్టర్లు రాజు, కృష్ణవేణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.