
కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం
గద్వాలటౌన్: కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ కుసుమ కుమార్ అన్నారు. శనివారం స్థానిక హారిత టూరిజం హాల్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి, గత ప్రభుత్వంపై పోరాటం చేసిన కార్యకర్తలకు పార్టీ పదవుల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు దక్కుతాయన్నారు. కొత్తగా చేరిన వారికి పదవులిచ్చే ప్రసక్తి లేదన్నారు. కార్యకర్తల శ్రమ ఫలితమంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు ముమ్మర ప్రయత్నం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉందన్నారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వంద శాతం రుణమాఫీ జరిగిందని, బీఆర్‌ఎస్, బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ సంస్థాగత అంశాలపై నాయకులకు మార్గనిర్ధేశం చేశారు.
సంఘటితంగా పనిచేయాలి : సంపత్‌కుమార్
ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పదవులకు ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయమన్నారు. అయితే ఎమ్మెల్యేతోపాటు ఆయన వర్గీయులు ఎవురూ కూడా సమావేశానికి హాజరు కాలేదు. గైర్హాజరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమలేష్, నాయకులు దొడ్డెప్ప, నల్లారెడ్డి, ఇసాక్, నారాయణరెడ్డి, సుకన్య, నాగశిరోమణి, గట్టు క్రిష్ణ, గౌస్, డీఆర్ శ్రీధర్, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. ఆలయ అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు.