
గ్రామాల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట
రాజోళి: బీజేపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టి. రామాంజనేయులు అన్నారు. శనివారం స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో భాగంగా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో మండల అధ్యక్షుడు బోయ నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు గ్రామ పంచాయతీల అభివృద్ధిని తుంగలో తొక్కారని అన్నారు. బీజేపి ప్రభుత్వంలో గ్రామాల్లో వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు అంగన్ వాడీల ఆధునీకరణ కోసం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులను నేరుగా కేటాయించిందని అన్నారు. ఇంత అభివృద్ధి చేసిన బీజేపి పార్టీకి మాత్రమే స్థానిక సంస్థల్లో ఓటు అడిగే అర్హత ఉందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జయలక్ష్మీ, సీనియర్ నాయకులు రాజగోపాల్, సంజీవ రెడ్డి తదిదరులు పాల్గొన్నారు.