
జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచాలి
మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100 శాతం అడ్మిషన్లు పెంచాలని జిల్లా నోడల్ అధికారి హృదయరాజ్ అధ్యాపకులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీగంగు వెంకటకృష్ణారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్‌బోర్డ్ కమిషనర్ ఆదేశానుసారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. ప్రతి జిల్లా పరిషత్ పాఠశాలలకు వెళ్లి ఎంతమంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేశారని వివరాలు సేకరించి, నేరుగా వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అడ్మిషన్ల కోసం ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కళాశాలలో సగం మంది అధ్యాపకులు ఉండి మిగితా వారు గ్రామా ల్లో పర్యటించాలన్నారు. అదేవిధంగా పల్లెపాడు, బోరవెల్లి గ్రామాల్లో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తామని, డిపో మేనేజర్‌తో మాట్లాడతామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.