
డివైడర్ పనుల ఆలస్యంతో ట్రాఫిక్ సమస్య
అలంపూర్: మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ఆలస్యంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. నెలల తరబడిగా నిలిచిన పనులు ఇటివలే పునః ప్రారంభించారు. పనులు నిదానంగా చేపడుతుండడంతో ప్రజలు, యాత్రికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అలంపూర్ మున్సిపాటీలో డివైడర్ విత్ సెంట్రల్ లైటింగ్ పనులు 15 రోజుల క్రితం ప్రారంభించారు. అందులో భాగంగా రోడ్డు మధ్యలో తవ్వకాలు చేపట్టారు. రోడ్డు విస్తరణ చేపట్టే కంటే డివైడర్ పనులు చేపడుతున్నారు. దీంతో జోగుళాంబ క్షేత్రానికి యాత్రికులతో వస్తున్న ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, లారీలు గాంధీచౌక్ వద్ద మలుపు తీసుకోవడానికి సాధ్యపడటం లేదు. భారీ వాహనాలు మద్యలోనే నిలిచిపోతుండటంతో నిత్యం వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతో తీవ్ర అసౌకర్యంగా మారింది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఈ సమస్య తలెత్తుందని స్థానికులు అందోళన వ్యక్తం చేశారు.
మున్సిపల్ కమిషనర్‌కు వినతి
రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకుండా డివైడర్ కోసం తవ్వకాలు చేపట్టడంతో బస్సులు, భారీ వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివేకానంద యూత్ సొసైటీ అధ్వర్యంలో స్థానిక ఆయా పార్టీల నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు శ్రీరాములుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ముందుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అనంతరం డివైడర్ పనులు చేపట్టాలని, యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు.