
మోతాదుకి మించి ఎరువులు వాడొద్దు
అలంపూర్: రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడవద్దని, నూతన సాంకేతిక పద్ధతిలో వచ్చిన నానో యూరియా, నానో డీఏపీ వాడాలని, అలాగే వానాకాలం పంట సీజన్‌లో ఎరువుల కొరత ఉండదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. అలంపూర్ పట్టణంలోని పీఏసీఎస్ గోదాంలో నిల్వ ఉన్న యూరియా, రికార్డులను పరిశీలించి యూరియా 400 బస్తాలు, డీఏసీ 150 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. పంట సాగుకు అనువుగా ఎరువులు ఉన్నాయన్నారు. అనంతరం రైతులకు యూరియా, నానో డీఏపీ, యూరియాను అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్ రెడ్డి, పీఏసీఎస్ కార్యదర్శి శ్రీనివాసులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయిరాం పాల్గొన్నారు.
అంతర కృషితో లాభాలు
అంతర కృషితో రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయని డీఏఓ అన్నారు. ఉండవెల్లి మండలంలోని మారమునగాల, తక్కశీల, కంచుపాడు, ఉండవెల్లి గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, కంది వంటి పంటలను పరిశీలించారు. డి–బూడ్దిపాడు గ్రామంలో సర్యప్రకాష్ రెడ్డి సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. పంట సాగులో సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం, సకాలంలో అంతర కృషి వలన కలిగే లాభాలను వివరించారు. పంట వేసిన 40 రోజులు పొలంలో గడ్డి మొక్కలు, కలుపు నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.