
ఎస్సీ, ఎస్టీ కేసులపై విచారణ వేగవంతం
గద్వాల క్రైం: గద్వాల డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మొగిలయ్యతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులపై విచారణ వేగవంతం చేయాలని, నకిలీ విత్తనాల పంపిణీపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు
గద్వాల: తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో టెన్త్, ఇంటర్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యలో చదువు మానేసిన వారు, ఉన్నత విద్య చదువుకోవాలి అనుకునేవారి, ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగించాలి అనుకునేవారికి ఇది చక్కటి అవకాశమని అన్నారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ రెగ్యూలర్ విద్యాసంస్థల ద్వారా పొందే సర్టిఫికెట్‌తో సమానమని, దీని వల్ల ఉన్నత విద్య, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ అవకాశాల పదోన్నతులు తదితర అవకాశాలకు వీలుంటుందని పేర్కొన్నారు.
చేనేత వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
గద్వాల: చేనేత కార్మికులకు తమ వృత్తిలో నైపుణ్యంతో పాటు సాంకేతికంగా అభివృద్ధి చెందే విధంగా జిల్లాలో టీపీసీ, ర్యాంపు పథకం జగదీష్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆద్వర్యంలోని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ జగదీష్ ప్రెవేట్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో చేనేత కార్మికులకు మాస్టర్ వీవర్స్ ర్యాంపు, ఎగుమతులు, దిగుమతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరగౌడ్ మాట్లాడుతూ గద్వాల చేనేల చీరలకు ఉన్న డిమాండ్ అనుసరించి సరికొత్త సాంకేతిక మెరుగు పర్చుకోవడానికి ర్యాంపు ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, స్కిల్ ట్రెనింగ్ ఇన్స్టిట్యూట్ డెరెక్టర్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
ఎన్టీఆర్ కళాశాలలో ఉద్యోగ మేళా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళాను మ్యాజిక్ బస్ టెక్ మహేంద్ర, ముతూట్ ఫైనాన్స్, వైసీస్ క్లౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేళాలో మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొనగా.. 50 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పద్మాఅనురాధ, అమీనా ముంతాజ్, శ్రీదేవి, హరిబాబు, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.