
శాకంబరీదేవి నమోస్తుతే..
అమ్మవారికి కూరగాయలే వస్త్రాభరణములు కాగా.. ఆకుకూరలు, ఫలాలు మాలలు అయ్యాయి. నవరత్నాలు పొదిగినట్లుగా గుమ్మడి కాయలు, క్యాబేజీ, క్యారెట్లు స్వర్ణ కిరీటాలయ్యాయి. కంద మాలలు జటామకుటాలుగా అలంకరించగా.. జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాలలో అమ్మవారు శాకంబరిదేవి అలంకరణలో మెరిసిపోయారు. శుక్రవారం జమ్ములమ్మ ఆలయం, అయ్యప్పస్వామి సన్నిధిలోని అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అంతకుముందు భక్తులు భజనలు, భక్తిగీతాలు ఆలపించారు. – గద్వాలటౌన్