వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

Jul 12 2025 9:59 AM | Updated on Jul 12 2025 9:59 AM

వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలు అందించాలి

ట్రామా కేర్‌ సెంటర్‌, జిల్లాకు ఓ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి

మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్‌/ కల్వకుర్తి/ కల్వకుర్తి టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనం ప్రారంభం, జనరల్‌ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, నాగర్‌కర్నూల్‌ మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి, కల్వకుర్తి పట్టణంలో వంద పడకల ఆస్పత్రి భవనం శంకుస్థాపన, వెల్దండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లోఅధునాతన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్‌ సెంటర్‌, జిల్లాకు ఓ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

రూ.140 కోట్లతో రోడ్ల అభివృద్ధి

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్‌నగర్‌–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వనపర్తి నుంచి జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ నుంచి మున్ననూర్‌ వరకు ప్రధాన రహదారికి మరి కొన్ని రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నాగర్‌కర్నూల్‌ మెడికల్‌ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తన చారిటీ ట్రస్టు ద్వారా కృషిచేస్తానన్నారు.

రెండు ఎలక్ట్రిక్‌ బస్సులు

రాష్ట్ర ఎకై ్సజ్‌ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మెడికల్‌ కళాశాలకు రూ.50 లక్షలు మంజూరు చేస్తూ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఎలక్ట్రిక్‌ బస్సును ఏర్పాటు చేస్తానన్నారు. జూనియర్‌ వైద్యులు తమ సొంత గ్రామాలను మరువవద్దని, గ్రామీణ స్థాయి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు. వైద్య విద్యార్థుల కల నేటితో నెరవేరిందన్నారు. వైద్యులు రోగులకు మందులతో పాటు రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలియపరచాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయం, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌, డీసీహెచ్‌ఎస్‌ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement