
బాలలను పనిలో పెట్టుకోవద్దు
ఉండవెల్లి: బాలలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముస్కాన్ టీం సభ్యులు హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో వారు పర్యటించారు. అలంపూర్ చౌరస్తాలోని మెకానిక్ షాప్‌లో మైనర్ బాలుడు షేక్ అన్సార్‌బాషా పనులు చేస్తున్నట్లు సమాచారం రావడంతో గురువారం ముస్కాన్ టీం సభ్యులు దాడులు చేశారు. దీంతో మైనర్ సంరక్షించి, యజమాని మహ్మద్ షషావలిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ శేఖర్ కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో లేబర్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ మోహిన్‌పాషా, ఎస్‌ఐ కేశవరావు, ఎస్‌ఈ సుధారాణి, రాజు, ఐసీపీఎస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
ధరూరు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యమని జిల్లా బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వివిధ దుకాణాలు, కిరాణ, వెల్డింగ్ షాపులు, బైక్ మెకానిక్, హోటళ్లను ముస్కాన్ బృంద సభ్యులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్న బాల కార్మికుడిని గుర్తించి బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ చట్టరీత్యా నేరమన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సయ్యద్‌అలీ, కానిస్టేబుల్ నరేష్, చైల్డ్‌లైన్ సిబ్బంది కళావతి తదితరులు పాల్గొన్నారు.
బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభం
గద్వాల: విద్యార్థులు చదువుతో పాటు, క్రీడల్లో సైతం ప్రావీణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ ఎం.జయరాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్‌ఆర్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరుగుతున్న బాలికల సీబీఎస్‌ఈ క్లస్టర్–7 కబడ్డీ చాంపియన్‌షిప్–2025 పోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 20 పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నట్లు పాఠశాల డైరెక్టర్ రాము తెలిపారు. కార్యక్రమంలో బెటాలియన్ డీఎస్పీ ఫణి, సీఐ రాజు తదితరులు పాల్గొన్నారు.
2 బస్సులు సీజ్
అయిజ: మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న న్యూ కాకతీయ మెమోరియల్ స్కూల్‌కు సంబంధించిన రెండు బస్సులను గురువారం రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సీజ్ చేశారు. ఫిట్‌నెస్ లేకపోవడం, నిబంధనల ప్రకారం పత్రాలు లేకపోవడంతో రెండు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

బాలలను పనిలో పెట్టుకోవద్దు