ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
గద్వాల క్రైం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని.. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా జడ్జి కె.కుషా అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 44 మంది విద్యార్థులకు జడ్జి సైకిళ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుతున్న విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలలకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కరించేందుకుగాను సైకిళ్లు అందజేశామన్నారు. వసతులను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని అన్నారు. న్యాయమూర్తులు గంట కవితాదేవి, టీ లక్ష్మీ, ఎన్‌వీహెచ్ పూజిత, మిథున్‌తేజ్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
గద్వాలటౌన్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 20 నంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షల కోసం రెండు పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, టెన్త్ పరీక్షలకు 501 మంది విద్యార్థులు, ఇంటర్ పరీక్షలకు 721 మంది హజరవుతున్నారని చెప్పారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంటర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొన సాగుతాయన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు స కాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
అభివృద్ధిపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం
అలంపూర్: ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధిపై ఉన్నతస్థాయి కమిటీ శనివారం సమావేశమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి వల్లీ నాయగం, అడ్వైజర్ గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, శృంగేరి పీఠాధిపతి శిష్య బృందం శనివారం అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో దేవస్థానం చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్‌తో వారు సమావేశమై భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి గర్బాలయాలను పరిశీలించారు. ఆలయాల్లో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు, సేవలను తెలుసుకున్నారు. ఆలయ ధర్మకర్తలు జగదీశ్వర్‌గౌడ్, అర్చకులు ఉన్నారు.
23 నుంచి బాలభవన్‌లో వేసవి శిక్షణ తరగతులు
గద్వాలటౌన్: వివిధ కళల పట్ల చిన్నారులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని మరింత ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని బాలభవన్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 23 నుంచి జూన్ 2 తేదీ వరకు వేసవి శిక్షణ తరగతులు కొనసాగుతాయని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ శిబిరం ఉంటుందని చెప్పారు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, వాయిద్యం, కుట్లు, అల్లికలు అంశాలలో శిక్షణ ఇస్తామన్నారు. 05–16 ఏళ్లలోపు వయస్సు గల చిన్నారులు ఉచిత శిక్షణ తరగతులకు అర్హులని, ఆసక్తి గల చిన్నారులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోస్టు సైజ్ ఫొటోతో బాలభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేసవి శిబిరాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇతర వివరాలకు సెల నంబర్ : 96668 53335, 94409 81190 సంప్రదించాలని కోరారు.
రామన్‌పాడులో
తగ్గుతున్న నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 270 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 34 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.


