కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని ఇటీవల సాక్షి దినపత్రికలో ‘నిధులున్నా.. అనుమతుల్లేవ్’ అనే శీర్షికన ప్రచురితమైంది. దీంతో స్పందించిన సర్పంచ్ గారె విజయలక్ష్మీశంకర్ ఆదివారం జేసీబీ సాయంతో బండలు, కంకరతో మట్టితో తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కుంగిన బావి..
రేగొండ: పంటకు సాగు నీటి కోసం తవ్వించిన బావి భూమిలోకి కుంగింది. ఈ ఘటన కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్‌పూర్‌లో చోటు ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కొండా చందర్ 8 సంవత్సరాల క్రితం రూ.15 లక్షల వ్యయంతో బావిని తవ్వించి చుట్టూ ఓడలను నిర్మించాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం బావి వద్దకు వెళ్లగా బావి ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. దీంతో తనకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందజేయాలని రైతు కోరాడు.
శాంతించిన గోదావరి
ఏటూరునాగారం: మండల పరిధిలోని రామన్నగూడెం వద్ద మూడు రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. ఈ మేరకు ఆదివారం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 14.81 మీటర్లుగా నమోదు అయ్యింది. గోదావరి వరద ఉధృతి తగ్గి దిగువకు వెళ్తుండడంతో మండలంలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద ఉధృతి తగ్గినప్పటికీ కరకట్ట వద్ద పరిస్థితి అదుపులోకి రాలేదు. మట్టి క్రమక్రమంగా ఒర్లిపోతుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక బస్తాలను వేసి మట్టి ఒర్లిపోకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
భద్రకాళిని దర్శించుకున్న వరంగల్ సీపీ శ్వేత
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐఆర్‌ఎస్ అధికారి అపూర్వ సందర్శించా రు. ఈ సందర్భంగా అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, మహాదాశ్వీచనం అందజేశారు.
క్యాంపస్ సెలక్షన్స్‌కు
కాన్‌క్లేవ్ దోహదం
కాజీపేట అర్బన్: క్యాంపస్ సెలక్షన్స్‌లో నిట్ విద్యార్థులకు ఇండస్ట్రీ కాన్‌క్లేవ్–26 దోహదపడుతుందని నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్‌కుమార్ తెలిపారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఆదివారం నిట్ సీసీపీడీ (సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ కాన్‌క్లేవ్ కెరీర్ లాంచ్ సమ్మిట్–26 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ వివరాలతో కూడిన బ్రౌచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. నిట్ విద్యార్థులు పరిశ్రమల్లో రాణించేందుకు తొలిసారిగా ఇండస్ట్రీ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సదస్సు వేదికగా నిలుస్తుందని తెలిపారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆన్‌లైన్‌లో సదస్సును వీక్షించారు. ప్లేస్‌మెంట్‌లో విద్యార్థులు ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. పరిశ్రమల ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


